ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతూ గిరిజనులు డోలీలతో నిరసన చేపట్టారు. పార్వతీపురం ఐటీడీఏ వరకు ప్రదర్శనగా వచ్చి నినాదాలు చేశారు. గ్రామంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఎదురైతే పదిహేను కిలోమీటర్లు డోలీ సహాయంతో బాధితులను తీసుకెళ్లాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు. తుప్పలు, రాళ్లపై నడుచుకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. సరైన రహదారి లేక విద్య వైద్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.
డోలీల సహాయంతో ఆస్పత్రికి వెళ్లే క్రమంలో గర్భిణీలు కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వాతావరణం: బలపడనున్న అల్పపీడనం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు