Traffic new rules in Hyderabad: ట్రాఫిక్ పోలీసులు జంట నగరాల్లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయని ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ‘రోప్’(రిమూవల్ ఆప్ అబ్‌స్ట్రిక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్)పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్‌లైన్ దాటితే రూ.వంద జరిమానా విధించనున్నామని చెప్పారు.
ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.వెయ్యి జరిమానా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లను దుకాణదారులు ఆక్రమిస్తే భారీ జరిమానా ఉంటుందని సీపీ తెలిపారు. పాదచారులకు ఆటంకం కలిగేలా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా ఉంటుందన్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని జాయింట్ సీపీ స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించి సహకరించాలని ఆయన కోరారు.
భారీగా పెరిగిన వాహనాల వినియోగం.. హైదరాబాద్ మహానగరంలో వాహనాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. వ్యక్తిగత వాహనాల వినియోగం ఎక్కువైంది. నగరంలో రహదారులపై ప్రతిరోజు దాదాపు 80 లక్షల వాహనాలు తిరుగుతున్నట్టు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ద్విచక్రవాహనాలే దాదాపు 56 లక్షల వరకు ఉన్నాయి. సుమారు 14 లక్షల కార్లు ఉన్నాయి. కిలోమీటర్ల తరబడి వాహనాలు రోడ్లుపై ఉండవలసి వస్తోంది. ఒక్కోసారి గంటల తరబడి రహదారులపైనే వాహనదారులు నిరీక్షిస్తున్నారు. ఇది ట్రాఫిక్ పోలీసులకు తీవ్రమైన సమస్యగా మారింది. ఫుట్ పాత్‌ల ఆక్రమణ, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ఉంచడమే ట్రాఫిక్ సమస్యలకు కారణమని ట్రాఫిక్ పోలీసులు తేల్చారు.
ఇవీ చదవండి: