Revanth Letter to PM Modi : ప్రధాని మోదీకి 9 ప్రశ్నలు సంధిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదన్న రేవంత్‌రెడ్డి... నిజామాబాద్‌లో పసుపు బోర్డు హామీని నెరవేర్చుతారా? లేదా? స్పష్టతనివ్వాలని కోరారు.
విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. ఐటీఐఆర్ ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ప్రశ్నించారు. నైనీ కోల్ మైన్స్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ఆరోపించామన్న రేవంత్‌రెడ్డి... గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతోందో చెప్పాలన్నారు. రామాయణం సర్క్యూట్ ప్రాజెక్ట్‌లో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
"తెరాస, భాజపా ఉప్పు-నిప్పు అన్నట్లుగా నాటకమాడుతున్నాయి. భాజపా, తెరాస మధ్య చీకటి బంధం ప్రజలకు తెలుసు. విద్యుత్ సంస్కరణలు తెరాస అంతర్లీనంగా అమలు చేస్తోంది. కాళేశ్వరంలో అవినీతిని ప్రధాని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? విభజనచట్టం ప్రకారం రావల్సిన గిరిజన వర్సిటీ అతీగతీ లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి తీవ్రంగా క్షోభ పెడుతున్నారు." -- రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్