ఏపీలోని విశాఖ మన్యం పర్యటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. కార్తికమాసం... అందులోనూ ఆదివారం కావటంతో లంబసింగికి పర్యటకులు పోటెత్తారు. ముఖ్యంగా లంబసింగి కూడలి, వంజంగి కొండ, తాజంగి జలాశయం, చెరువుల వేనం, కొరుబయలు ప్రాంతాలు సందడిగా మారాయి. వంజంగి కొండల్లో మేఘాల అందాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేకువజామున ఆ అందాలు మరింత ఆకర్షిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే మన్యానికి 5 వేల మందికి పైగా పర్యటకులు వచ్చారని అంచనా.
లంబసింగిలో తెల్లవారుజామున మంచు అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యటకులతో నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సందర్శకులు రహదారిపై ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేయటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. రాకపోకలు నాలుగు గంటల పాటు స్తంభించాయి. చింతపల్లి పోలీసులు లంబసింగికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.