తిరుమలలోని మహాద్వారం తలుపులకు బంగారు తాపడం చేయించడంతో పాటు ధ్వజస్తంభ పీఠం, బలిపీఠాలకు మరమ్మతులు చేయాలని తితిదే నిర్ణయించింది. ఇందుకోసం తితిదే ఖజానా నుంచి 6.625 కిలోల బంగారాన్ని వినియోగించుకునేందుకు తితిదే ధర్మకర్తల మండలి ఆమోదించింది. కొద్దిరోజుల్లోనే టెండర్లు పూర్తిచేసి ఈ పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తిరుమలలోని మహాద్వారానికి దశాబ్దాల క్రితం బంగారు తాపడం వేయించారు. ఇది కాలక్రమంలో కళావిహీనంగా మారిపోయినట్లు అధికారులు గుర్తించారు. దాంతో అధికారులు మహాద్వారాన్ని మే నెలాఖరులో పరిశీలించి, 2.30 మీటర్ల ఎత్తున బంగారు తాపడం మొత్తం పోయి రాగిరేకులు బయటకు కనిపిస్తున్నట్లుగా గుర్తించారు. వీటికి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. మహాద్వారం బంగారు తాపడానికి రూ.3.09 కోట్ల విలువైన 6.625 కిలోల 24 క్యారెట్ల బంగారం అవసరమని అంచనా వేశారు. 18 గేజీల రాగిరేకులు 8 కిలోలు కావాలని, రాగి సీలల్లాంటి (నాబ్స్) వాటి కోసం 60 కిలోల రాగి అవసరమని స్పష్టం చేశారు. మొత్తంగా బంగారం, రాగితోపాటు మరమ్మతులు చేసే సిబ్బంది ఖర్చులు కలిపి సుమారు రూ.3.13 కోట్లు అవుతుందని ప్రతిపాదించారు.
వైకుంఠద్వార దర్శనానికి అదనంగా 18 వేల టికెట్లు
ఏకాదశి మొదలు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకొన్న తితిదే.. శ్రీవాణి ట్రస్టు ద్వారా 18 వేల టికెట్లు జారీచేయనుంది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా రోజుకు 20 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన తితిదే.. సర్వదర్శనం ద్వారా మరో పదివేల టికెట్లను ఈ నెల 24 నుంచి జారీ చేయనుంది. వీటికి అదనంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా పది రోజులకు మరో 18 వేల టికెట్లను జారీచేయాలని తితిదే నిర్ణయం తీసుకొంది. భక్తుల రద్దీ, ప్రముఖుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 25 వైకుంఠ ఏకాదశి, జనవరి 1న వెయ్యి టికెట్ల చొప్పున శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. మిగిలిన 8 రోజుల పాటు రోజుకు 2 వేల చొప్పున శ్రీవాణి ట్రస్టు నుంచి జారీ చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేలు విరాళంగా ఇవ్వడంతో పాటు రూ.500 చెల్లించి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకొనేందుకు తితిదే అవకాశం కల్పించింది.
ఇదీ చదవండి: తితిదేకు గుదిబండగా మారుతున్న శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్..!