అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు.. వైభవంగా ధ్వజారోహణ నిర్వహించారు. ముందుగా బంగారు తిరుచ్చిపై సన్నిధి నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని..... పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతిని, ధ్వజపటాన్ని.. ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల నడుమ అర్చకులు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. గోవిందాచార్యులు కంకణ భట్టర్ గా వ్యవహరించి.. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు.
ధ్వజారోహణం అనంతరం బ్రహ్మోత్సవాలలో తొలి వాహన సేవైన పెద్దశేషవాహన సేవను నిర్వహించారు. ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చిన పెద్దశేషవాహన సేవను పరిమళభరిత పూలమాలలు, విశేషతిరువాభరణాలతో అలంకరించారు. ఉభయదేవేరులతో కలసి ఏడుతలల శేషవాహనంపై పరమపదనాథుని అవతారంలో స్వామి వారు అభయ ప్రదానం చేశారు. అర్చకులు, జీయంగార్లు స్వామివారికి నిర్వహించే వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాడవీధుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ కరోనా ప్రభావంతో ఆలయంలోనే నిరాడంబరంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం తొమ్మిది నుంచి పది గంటలకు చిన్నశేషవాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటలకు ఉత్సవ మూర్తులకు స్నపనతిరుమంజనం, రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు హంసవాహన సేవను నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: ఆయిల్ ఫామ్ సాగులో అధిక ఆదాయానికి ప్రత్యేక నమూనా