తోటకూర, గోంగూర మార్కెట్ నుంచి తెచ్చిన కాసేపటికే తాజాదనాన్ని కోల్పోయినట్లుగా అయిపోతాయి. ముందుగా వీటి ఆకులను కాడలనుంచి వేరుచేసి, నీళ్లపంపు కింద ఉంచి మృదువుగా శుభ్రం చేయాలి. ఆ తరువాత తడి పోయేవరకు పేపర్ టవల్స్‌పై వేసి ఆరబెట్టాలి. చెమ్మంతా పోయిన తరువాత వీటిని పేపర్ టవల్ లో చుట్టి, గాలి చొరబడి డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే చాలు. మూడు నాలుగు రోజులపాటు తాజాగా ఉంటాయి.
పుదీనాను ఫ్రిజ్ అవసరం లేకుండానే తాజాగా ఉండేలా చేయొచ్చు. వీటి కాడలను నీటిలో మునిగేలా ఉంచి, గది వాతావరణంలో పెడితే చాలు, పాలకూర, మెంతికూరలు నిమిషాల్లో వాడిపోయినట్లు అయిపోతాయి. బజారు నుంచి తెచ్చిన వెంటనే గోరువెచ్చని నీటిలో అరనిమిషం పాటు ఉంచి వెంటనే తీసి మళ్లీ చల్లని నీటిలో ముంచాలి. ఆ తరువాత తీసి ఆరబెట్టి జిప్‌లాక్ బ్యాగులో ఉంచి ఫ్రీజర్‌లో పెట్టాలి. వంట చేసే పది నిమిషాల ముందు తీసి బయటపెడితే చాలు.
కాలీఫ్లవర్ దీనికుండే ఆకులను తీసేసి, వంటకు సిద్ధంగా కట్ చేసుకోవాలి. కడగకుండా కాగితం కవర్లలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఉంటుంది. అలాగే క్యారెట్లను పొడి వస్త్రంతో తడి లేకుండా తుడిచి ఫ్రిజ్‌లోని కూరగాయల బాక్సులో ఉంచాలి. వాటిపై నల్లని మచ్చలు వస్తే మాత్రం వెంటనే బయటకు తీసి గాలి తగిలేలా ఉండాలి. వీలైనంత త్వరగా వినియోగించాలి. క్యాబేజీని వండేముందే శుభ్రం చేయాలి.
కరివేపాకు, కొత్తిమీర ఈ ఆకులను కొమ్మ నుంచి వేరుచేసి నీటిలో శుభ్రపరిచి ఆరబెట్టాలి. తడిపోయిన తరువాత పొడిగా ఉండే డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. వారం రోజులైనా ఈ ఆకులు తాజాగా ఉంటాయి. బయట ఉంచినా కూడా మూడు రోజులపాటు వాడిపోవు. అలాగే కొత్తిమీరను కడిగి, తడి లేకుండా ఆరబెట్టి చిన్నచిన్న రంధ్రాలున్న కవర్లో ఉంచితే చాలు.