Tiger in kakinada: కాకినాడ జిల్లాలో రాయల్ బెంగాల్ టైగల్ సంచారం ఒక చోటుకు పరిమితం కావడం లేదు. శనివారం రాత్రి వజ్రకూటం సమీపంలోని రెండు కొండల మధ్య ఆటోలో వెళ్తున్నవారి కంటపడి అలజడి రేపింది. వజ్రకూటం, రామన్నపాలెం, కత్తిపూడి గ్రామాల పరిధిలోని కొండల్లో పలుచోట్ల పులి పాదముద్రలు గుర్తిచారు. జాతీయ రహదారికి 5 కి.మీ. లోపే సంచరించడంతో యంత్రాంగంలోనూ మరింత ఆందోళన పెరిగింది. ఎన్‌ఎస్‌టీఆర్ డీఆర్‌వో ప్రసాద్‌రెడ్డి బృందం ఆ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.
20 రోజులుగా ఇక్కడే..: జిల్లా కేంద్రం కాకినాడకు 40 కిలోమీటర్ల దూరంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, గొల్లప్రోలు మండలాల మధ్య 20 రోజులుగా పులి సంచరిస్తోంది. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, కొడవలి, వజ్రకూటం ప్రాంతాలు కొండలు, వాగులు, పుష్కర, ఏలేరు కాలువలతో ఉంటాయి. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు, చెట్లతో ఉన్న మెట్టలు అడవిని తలపిస్తాయి.
ఇదే అనువుగా బెబ్బులి భావించి ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆకలికి మించి వేటాడని, బోనులో ఎరవేసినా.. లొంగని వ్యాఘ్రం ఇప్పటికే అయిదు పశువులను వధించింది. దాన్ని తిరిగి అడవిలోకి పంపాలనే మంత్రాంగాన్ని తిప్పికొడుతూ ఇక్కడిక్కడే తిరుగుతోంది.
ఎందుకు ఉందంటే..?
* పులి ఇన్ని రోజులు అటవీప్రాంత సమీప మైదానంలో తిష్ఠ వేయడానికి కారణాలను వన్యప్రాణి, అటవీ అధికారులు విశ్లేషించుకుంటున్నారు.
* పులి కౌమారదశకు చేరినపుడు అదో ప్రత్యేక భూభాగాన్ని (టెరిటరీ) ఖాయపరుచుకుంటుంది. మగ పులి 25 నుంచి 40 చ.కి.మీ. విస్తీర్ణాన్ని తన రాజ్యంగా భావిస్తుంది. తన కదలికలు, ఉంచే ఆనవాళ్లతో మిగతా జంతువులు పులి ఉనికిని గుర్తిస్తాయని చెబుతున్నారు. వేటకు అనువుగా ఉన్న పరిస్థితులను అది చూసుకుంటుంది.
* పులి ఉండే తన సహజ ఆవాసంలో పరిస్థితులకు విఘాతం కలిగి ఉండవచ్ఛు అడవుల్లోనూ ఏదో రూపేణా జనం చేసే చప్పుళ్లు కారణం కావచ్ఛు రిజర్వు ఫారెస్టులనే ఖనిజ తవ్వకాలకు, ఇతర క్వారీలకు కేటాయిస్తున్నారు. విశాఖ మన్యం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపప్రణాళిక మన్యం వంతాడ, ఏజెన్సీ వరకూ జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం కాగా..వన్యప్రాణులు జనం బాట పట్టడానికి ఇదో కారణం.
* ఆహార పిరమిడ్‌లో ప్రాథమిక లబ్ధిదారులు శాకాహార జంతువులు, వాటిపై ఆధారపడే మాంసాహారులు వీటిని నియంత్రించే పులి, చిరుత, సింహం. ఆహార సైకిల్‌కు భంగం అనిపించిన పరిస్థితుల్లోనూ వన్యప్రాణులు పక్కచూపు చూస్తాయి. మన్యం చేరువగా ఉన్న ఈ ప్రాంతంలో పాడిపశువులు, అడవి పందులు, కణుజులు, గొర్రగేదెలు పులి పరిశీలనలో ఉండడం వల్లే ఇన్నిరోజులు తిష్ఠ వేసిందనుకుంటున్నారు.
* బైనాక్యులర్‌లో కనిపించినంత కంటి దృష్టి ఉండే పెద్దపులి చురుకుదనమూ అంతే.. తనచుట్టూ జరుగుతున్న అలికిడిని ఎంతదూరంలో ఉన్నా పసిగడుతోందని భావిస్తున్నారు.
అడవికి మళ్లేలా.. పులి అని గుర్తించినప్పటి నుంచి దానిని అడవిలోకి పంపే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. యుక్త వయసులో ఉన్న మగ పులి అది. తెలివిగానూ తిరుగుతోంది. ఒక ప్రాంతానికి పరిమితమై సంచరించడం లేదు. అందుచేత దాని గమనాన్ని పరిశీలిస్తూ ఊళ్లలోకి రాకుండా పెట్రోలింగ్ చేయడమే కీలకం. ఇప్పటివరకు అది పశువులనే వేటాడింది. ప్రజలకు హాని కలగకుండా చూస్తాం. -సెల్వం, వన్యప్రాణి విభాగం డీఎఫ్‌వో
ఇదీ చదవండి: Monsoon Enters Telangana : తెలంగాణను పలకరించిన తొలకరి జల్లు