తౌక్టే తుపాను ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు గోవాకు దక్షిణ నైరుతి దిశగా 330కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది క్రమంగా బలపడి రాగల ఆరు గంటల్లో తీవ్ర తుపానుగా ఏర్పడి తదుపరి 12 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారుతుందని తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి గుజరాత్ తీరాన్ని పోరుబందర్-నలియాల మధ్య ఈ నెల 18న సాయంత్రం తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేడు, రేపు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం... ఒకటి, రెండు చోట్ల పడే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావం దక్షిణ, నైరుతి, పశ్చిమ జిల్లాలపై రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.