Agnipath Protest News: ఇదీ ఓ ఆందోళనకారుడు వారు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన ఆడియో సందేశం. స్టేషన్ నుంచి బయటకెళ్లి సమీపంలోని బంకులో పెట్రోల్ తీసుకొచ్చి షాలీమార్ వెళ్ళే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కి ఓ ఆందోళనకారుడు నిప్పుపెట్టాడు. కానీ ఆ విషయాన్ని పోలీసులు గమనించలేదు. వాట్సాప్ గ్రూప్ ఆ సందేశాన్ని విని మరికొందరు పెట్రోల్ సీసాలతో లోపలికివచ్చారు. అయినా పోలీసులు మాత్రం గుర్తించలేకపోయారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి నిరసనకారులు వచ్చారు. కొందరు రాత్రంతా రైల్వేస్టేషన్ పరిసరాల్లో తచ్చాడగా.. ఉదయమే దాడులకు పూనుకున్నారు. మరికొందరు ఉదయం వచ్చిన రైళ్లలో చేరుకొని... దాడికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంస రచన వెనక ఇంత తంతంగం జరిగింది. అయినా పసిగట్టడంలో తెలంగాణ నిఘావిభాగం ఘోరంగా విఫలమైంది. రెండు, మూడురోజులుగా ఆందోళనకు నిరసనకారులు వ్యూహాలు రచిస్తున్నా గుర్తించలేకపోయారనే వాదన వినిపిస్తోంది.
కేంద్రం తెచ్చిన అగ్నిపథ్‌కి వ్యతిరేంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో యువత నిరసన కొనసాగిస్తూనే పలు రైళ్లను ధ్వంసం చేశారు. అయినా తెలంగాణ నిఘావర్గాలు అప్రమత్తం కాలేకపోయాయి. సాధారణంగా నిఘావర్గాలకు రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉంది. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనిచేస్తుంటారు. రాజకీయ పార్టీలతోపాటు....... పలువర్గాల నుంచి వివరాలు సేకరిస్తుంటారు. వాటికి సంబంధించి ప్రతిరోజు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తారు. నిరసనకారులు సమూహంగా ఏర్పడి.......... ఆందోళనలు చేసే అవకాశం ఉంటే ముందే అప్రమత్తమై వారిని అరెస్ట్ చేస్తారు.కానీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనల్లో మాత్రం మచ్చుకైనా గుర్తించిన దాఖలాలు కనిపించలేదు.
ఉమ్మడి ప్రవేశపరీక్ష రద్దు... అగ్నిపథ్ పథకం ప్రకటన నేపథ్యంలో... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఆర్మీ ప్రవేశ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు కుట్రపన్నారని రైల్వే, శాంతిభద్రతల పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో... తీవ్ర ఆందోళన నిర్వహిస్తే సైనికాధికారులు దిగివస్తారన్న అంచనాతో అభ్యర్థుల్లో కొందరు ప్రణాళిక రచించారు. ఇందుకోసం చలో సికింద్రాబాద్ పేరిట రెండురోజుల క్రితం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో 200మంది అభ్యర్థులు రాగా... వివిధ జిల్లాల నుంచి సుమారు 1800మంది గురువారం చేరుకున్నారు. మల్కాజిగిరి పరిసరాల్లో స్నేహితులు, బంధువులు, వసతిగృహాల్లో బసచేశారు. అదేరోజు రాత్రి 20మంది యువకులు అందరితో మాట్లాడి రైల్వేస్టేషన్‌లో ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? అన్న అంశాలను చర్చించుకున్నారు. పెట్రోలు తీసుకువచ్చే బాధ్యతలు కొందరికి అప్పగించారు. అంతా ఓకే అనుకున్నాక వాట్సాప్‌గ్రూప్‌లో మాట్లాడుకుంటూ శుక్రవారం ఉదయం 8.30గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లోకి వెళ్లి అనుకున్న పనిని పూర్తిచేశారు. వీరిలో 20మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు.. ఆందోళన వెనుక కారణాన్ని తెలుసుకున్నారు. గతేడాది హకీంపేటలో నిర్వహించిన ఆర్మీర్యాలీలో వారంతా అర్హులయ్యారు. వైద్యపరీక్షల్లోనూ అర్హతసాధించారని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: