తెలంగాణలో గోదావరి ఉద్ధృతిని తట్టుకునేందుకు వరద కట్టలను బలోపేతం చేయాలని రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్ల సంఘం సూచించింది. హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో సంఘం ప్రతినిధులు శుక్రవారం సమావేశమై ప్రభుత్వానికి సూచనలతో కూడిన తీర్మానాలు చేశారు. సంఘం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, వెంకట్రామారావు, అనంతరాములు, చంద్రమౌళి, రంగారెడ్డి, వెంకటేశం, జియావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వారు చేసిన సూచనలివీ..
- భద్రాచలం వద్ద 1986 ఆగస్టులో గరిష్ఠంగా వచ్చిన 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వల్ల అప్పట్లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరింది. ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశముంది. ప్రభుత్వం వరద కట్టలను బలోపేతం చేసి ప్రాణనష్టాన్ని నివారించాలి.
- కడెం జలాశయానికి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదకు సరిపోయే విధంగా డ్యాంకు ఎడమవైపు అదనంగా నీటి విడుదలకు ఏర్పాట్లు చేయాలి. దీనికి పైన ప్రతిపాదించిన కుప్టి జలాశయాన్ని వెంటనే చేపడితే కొంత వరదను అరికట్టవచ్చు.
- కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి, అన్నారం పంపింగ్ స్టేషన్ల మునకకు 1986 నాటి కంటే ఎక్కువ వరద రావడమే కారణం. పంపింగ్ స్టేషన్ల రక్షణకు చుట్టూ గోడ లేక మట్టికట్టను నిర్మించాలి.
- అన్నారం బ్యారేజీ దగ్గర వరద కట్టలను పెంచాలి. గోదావరి ప్రాణహిత సంగమం తర్వాత బ్యాక్‌వాటర్ ప్రభావంపై విశ్లేషణ జరపాలి.
- ఇవీ చదవండి : గోదారి గుప్పిట భద్రాద్రి.. నీటమునిగిన 95 గ్రామాలు
- యువకులను చితకబాది.. మూత్రం తాగించిన దుండగులు.. వీడియో తీసి!