మొక్కల పెంపకం, అటవీకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో సోమవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడించారు.
2017-18, 2018-19, 2019-20 సంవత్సరాల్లో తెలంగాణలో 15,07,758 హెక్టార్లలో అటవీకరణ/మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. 2017-18లో 4,89,673 హెక్టార్లు, 2018-19లో 4,53,325 హెక్టార్లు, 2019-20లో 5,64,760 హెక్టార్లలో ఈ కార్యక్రమం సాగింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంత భారీస్థాయిలో అటవీకరణ చేపట్టలేదు. 7,32,027 హెక్టార్ల అటవీకరణతో ఆంధ్రప్రదేశ్, 3,99,183 హెక్టార్లతో ఉత్తరప్రదేశ్, 2,34,009 హెక్టార్లతో గుజరాత్‌లు..తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2019-20లో దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటగా.. తెలంగాణలో 38.17 కోట్లు, మహారాష్ట్రలో 34.54 కోట్ల మొక్కలు, ఉత్తరప్రదేశ్‌లో 22.59 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 17.05 కోట్ల మొక్కలు నాటారు. దేశంలో 2019-20లో 150 కోట్ల మొక్కలు నాటగా.. 2023-24 నాటికి దీన్ని 253 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన రాజన్న ఆలయం