సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ కింది భాగంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రచార చిత్రాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) తొలగించింది. 75వ స్వాతంత్య్ర అమృతోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్‌సైట్లు, ఈ-మెయిల్స్‌లో సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ నినాదంతోపాటు, మోదీ ఫోటోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఉంచుతోంది. ఎన్‌ఐసీ నిర్వహించే అన్ని ఈ-మెయిల్స్‌కీ దీన్ని అనుసంధానం చేసింది. స్వతంత్ర ప్రతిపత్తిగల సుప్రీంకోర్టు ఈ-మెయిల్‌కూ ప్రభుత్వ ప్రచార చిత్రాన్ని జతచేయడంపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని తొలగించాలని లిఖితపూర్వకంగా తెలిపింది.
వెంటనే ఆ చిత్రాన్ని తీసేసి విద్యుత్తు వెలుగుల్లో ఉన్న సుప్రీంకోర్టు భవనం ఫొటోను పెట్టింది. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘న్యాయవ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫొటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్ అడుగుభాగంలో పొందుపరిచినట్లు గురువారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దృష్టికి వచ్చింది. దాంతో ఆ బొమ్మను తొలగించాలని కోర్టుకు అధికారిక ఈ-మెయిల్ సమకూరుస్తున్న ఎన్‌ఐసీని ఆదేశించాం’’అని అందులో పేర్కొంది.
ఇదీ చూడండి: త్వరలోనే నూతన సహకార విధానం: అమిత్ షా