Ramadan 2022: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు తేవాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన 'గంగజమునా తెహజీబ్' మరింతగా పరిఢవిల్లాలన్నారు. దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని సూచించారు.
నెలరోజుల పాటు నిష్ఠతో ఉపవాసాలు..
హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో నేటి నుంచి రంజాన్ పర్వదినం ప్రారంభమవుతుందని మత పెద్దలు ప్రకటించారు. నేటి నుంచి నెల రోజులపాటు ముస్లిం సోదరులు భక్తిశ్రద్దలతో కఠోర దీక్షతో ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుజామున 4 గంటల 46 నిమిషాలకు సహరీతో రోజా ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు ఇఫ్తార్‌తో ఉపవాస దీక్ష ముగుస్తుంది. మళ్లీ ఇదే విధంగా.. సమయంలో కొద్దిపాటి మార్పులతో నెలరోజులపాటు రోజాను పాటిస్తారు. ఈ నెలరోజులపాటు పాతబస్తీ ఆధ్యాత్మిక పరిమళాలు వికసించనున్నాయి.
ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమాలు..
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. పరమ పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన ఈ మాసంలో ప్రపంచంలోని ముస్లింలందరూ ఉపవాస దీక్షలో ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ మాసంలో భక్తిప్రపత్తులు, ఏకాగ్రత, ఆత్మను క్రమపద్దతిలో ఉంచుకుని క్రమశిక్షణలతో ఉపవాస దీక్షలు కొనసాగిస్తారని వివరించారు.
తెలంగాణ మత సామరస్యానికి పెట్టింది పేరని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని ధర్మాలను సమదృష్టితో చూస్తున్నారన్నారు. రంజాన్ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. మసీదులు, ఈద్గాల అభివృద్దికి, మరమ్మతులకు నిధులిస్తున్నామన్నారు. పేదలకు దుస్తుల పంపిణీతోపాటు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి: