Lancet's report on Covaxin: కొవాగ్జిన్ టీకా పిల్లల్లో అత్యంత సమర్థంగా పనిచేస్తుందని.. ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైందని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. 2 నుంచి 18 ఏళ్ల వారి మీద జరిగిన పరిశోధనల్లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ సురక్షితమైనదిగా తేలిందని లాన్సెట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్లు అత్యంత సురక్షితమైనవి ఉండాలని.. తాము విశ్వసిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత్‌లో పిల్లలకు ఇచ్చిన సుమారు 50 మిలియన్ల కొవాగ్జిన్ డోసులు పిల్లల్లో ఎలాంటి దుష్పరిణామాలు కలిగించటం లేదని స్పష్టం చేశాయన్నారు.
ఫేజ్ 2,3 క్లినికల్ ట్రయల్స్‌లోనూ కొవాగ్జిన్ పెద్దలతో పోలిస్తే పిల్లల్లో 1.7రెట్లు సమర్థంగా పనిచేస్తోందని లాన్సెట్ పేర్కొంది. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా పిల్లల్లో కొవాగ్జిన్ పనితీరుపై క్లీనికల్ ట్రయల్స్ జరపగా... వాటి ఫలితాల ఆధారంగానే సర్కారు 6 నుంచి 18 ఏళ్ల వారికి టీకా అందించేందుకు అనుమతులు జారీ చేసింది.