Tourism dept plans to develop the island in krishna water: చుట్టూ కృష్ణాజలాలు..మధ్యలో పెద్ద ద్వీపం. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అనేక అనుకూలతలు ఉన్న ప్రాంతం. నాగార్జునసాగర్ నుంచి బోటులో నాగార్జునకొండకు వెళ్లే దారి మధ్యలో ఇది కనిపిస్తుంది. దాదాపు 407 ఎకరాల్లో విస్తరించి ఉంది. మధ్య రాతి, కొత్త రాతి యుగాల్లో ఆదిమ మానవుల ఆవాసంగా ఇది ఉన్నట్లు పలు ఆధారాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకున్న బుద్ధవనం ప్రాజెక్టుకు సమీపంలో... నాగార్జునసాగర్ బోటింగ్ పాయింట్ నుంచి పది కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. పడవలో 50 నిమిషాల ప్రయాణం. నాగార్జునకొండకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొద్దిరోజుల క్రితం అధికారులు ఈ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వివరించారు. అక్కడ ఉన్న అనుకూలతలు, పర్యాటకంగా ఏం చేస్తే బాగుంటుందన్న వివరాలతో ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చినట్లు సమాచారం.
బోటింగ్, ట్రెక్కింగ్, రోప్‌వే?
నల్గొండ జిల్లాలోని ఈ ద్వీపాన్ని స్థానికంగా చాకలిగట్టుగా పిలుస్తుంటారు. చుట్టూ ప్రముఖ పర్యాటక ప్రదేశాల మధ్య ఉన్న ఈ ద్వీపాన్ని అభివృద్ధి చేస్తే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని భారీగా ఆకర్షించవచ్చని పర్యాటకశాఖ భావిస్తోంది. ఈ ద్వీపాన్ని ప్రకృతి, సాహస పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశం ఆలోచన రూపంలో, ప్రాథమికస్థాయిలో ఉందని పర్యాటకశాఖ వర్గాలు చెబుతున్నాయి. నాగార్జునసాగర్ నుంచి ద్వీపం వరకు చేరుకోవడానికి బోటింగ్‌తో పాటు రోప్‌వే ఏర్పాట్లు.. ద్వీపంలో రాత్రి బసకు వసతి, ట్రెక్కింగ్ వంటివి ఉంటే పర్యాటకుల్ని ఆకర్షించవచ్చని అధికారులు భావిస్తున్నారు. విదేశాల నుంచి బౌద్ధులు అధికంగా వచ్చే నాగార్జునకొండ ఈ ద్వీపానికి పక్కనే ఉంది. నాగార్జునకొండ కూడా ద్వీపమే కానీ, విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది.
సీఎం అనుమతితో అభివృద్ధిపై ముందుకు
కృష్ణా నది మధ్యలో, రాష్ట్ర పరిధిలో భారీ ద్వీపం ఉండటం అనుకూల అంశం. ఈ ద్వీపాన్ని పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించా. నేను కూడా చూసి వస్తా. స్థానిక ఎమ్మెల్యే భగత్ నుంచి కూడా ద్వీపంపై ప్రతిపాదన వచ్చింది. బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు ఈ ద్వీపాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ఆలోచనల్ని వివరిస్తా. సీఎం అనుమతించాక అభివృద్ధిపై ముందుకు వెళతాం.- శ్రీనివాస్‌గౌడ్, పర్యాటకశాఖ మంత్రి
ఇదీ చూడండి: Job notifications: ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ.. !