విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై ప్రభుత్వం నేడో, రేపో తుది నిర్ణయం తీసుకోనుంది. సెప్టెంబరు 1 నుంచి దశలవారీగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. మొదట 8వ తరగతి నుంచి పీజీ వరకు.. కొన్ని రోజుల తర్వాత 3 నుంచి 7 వరకు.. ఆ తర్వాత నర్సరీ నుంచి 2 వరకు ప్రత్యక్ష బోధనలకు విద్యా శాఖ సన్నద్ధమైంది. సీఎస్ సోమేశ్ కుమార్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నిన్న విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశయ్యారు.
రాష్ట్రంలో విద్యాసంస్థల్లో వసతులు, విద్యార్థుల సంఖ్య, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్కు సమర్పించారు. ప్రత్యక్ష బోధనకు ప్రారంభించాలని నిర్ణయించిన రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా వివరించారు. నిర్ణయం ప్రకటించిన తర్వాత సుమారు 15 రోజుల వ్యవధితో విద్యా సంస్థలు ప్రారంభించాలని నివేదికలో అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పచ్చజెండా ఊపితే నేడో, రేపో ఉత్తర్వులు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇదీ చదవండి: Bandi sanjay : బండి సంజయ్ పాదయాత్రకు పేరు ఖరారు..