viveka murder case : మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు (2019 మార్చి 15) ఉదయాన్నే తొలుత కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివేకా ఇంటికి వచ్చారని పులివెందుల వాసి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కె.శశికళ సీబీఐ అధికారులతో చెప్పారు. వివేకా ఇంట్లోకి వెళ్లిన అవినాష్‌రెడ్డి 3, 4 నిమిషాల తర్వాత బయటకు వచ్చి లాన్‌లో నిలుచొని ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారని తెలిపారు. ఇంతలోనే డాక్టర్ మధు, కొందరు నర్సులు స్టెతస్కోప్, బీపీ మిషన్, సెలైన్ బాటిల్, మందులతో వచ్చారన్నారు. కాసేపటికి వివేకా మృతి చెందారంటూ వారు వెల్లడించారని శశికళ చెప్పారు. తర్వాత వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వచ్చారని తెలిపారు. ఆ సమయంలో తానూ వివేకా ఇంటి లోపలికి వెళ్లానని.. బెడ్‌రూమ్‌లో రక్తం, బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని చూసి ఇది హత్యేనని తనకు స్పష్టంగా అనిపించిందని వివరించారు. వివేకా ఇంటికి ఆమె ఎందుకు వెళ్లారు, అక్కడేం జరిగిందనే అంశాలపై సీబీఐ ఆమెను విచారించి, 2020 సెప్టెంబరు 20న వాంగ్మూలం తీసుకుంది. అందులోని ప్రధానాంశాలివే..
ఆ సమయంలో అంతా నిశ్శబ్దంగా ఉంది...
‘నా భూమి వివాదాన్ని పరిష్కరించాలని 2019 మార్చి 13న చివరిసారిగా వివేకానందరెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశాను. ఆయన సరేనన్నారు. ఈ విషయంతో పాటు, వివేకా అభిమానైన డాక్టర్ చిన్నయ్యకు ఆయనతో కలిపి ఫొటో తీయించాలని మార్చి 14న ఆయన్ను కలవాలని ప్రయత్నించాను. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని వివేకా టైపిస్ట్ బాషా చెప్పారు. 15వ తేదీ ఉదయాన్నే రావాలని.. లేకపోతే ఆయన ప్రచారానికి వెళ్లిపోతారని చెప్పారు. ఆ రోజు ఉదయం 6 గంటలకు తొలుత అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లాం. ఆయనతో ఫొటోలు తీసుకున్నాక ఉదయం 6.30కి వివేకా ఇంటివద్దకు చేరుకున్నాం. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. లాన్‌లో వాచ్‌మన్ తప్ప ఎవరూ లేరు. తర్వాత వివేకా పీఏ కృష్ణారెడ్డి వచ్చారు. వివేకా లేరని, తిరుపతి వెళ్లారని మాతో చెప్పారు. బయట చెప్పులు చూశాం. మేము వివేకాను కలవటం ఇష్టం లేక కృష్ణారెడ్డి అబద్ధం చెప్పారని భావించి బయటకు వచ్చాం. ఇంతలోనే టైపిస్టు ఇనయతుల్లా లోపలికి వెళ్లారు. తర్వాత కొన్ని క్షణాల్లోనే అవినాష్‌రెడ్డి వివేకా ఇంట్లోకి వెళ్లారు’ అని శశికళ సీబీఐకి వివరించారు.
ఇదీచూడండి: ys viveka murder case: 'వివేకాను హత్య చేయించింది వారే'