మేడ్చల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. తాము మీటింగ్‌కి రాకుండా ఎలా సమావేశం ప్రారంభిస్తారని కొందరు అధికార పార్టీ జడ్పీటీలు ఆందోళనకు దిగారు. కోరం లేకుండా ఏవిధంగా మొదలుపెడతారని ప్రశ్నించారు. దీనితో సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన జిల్లా పరిషత్ సీఈవో ఇద్దరు సభ్యులు ఉన్నా కోరం ఉన్నట్లేనని... సమావేశంలో ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యులతోపాటు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉండటంతో సమావేశాన్ని ప్రారంభించామని వివరణ ఇచ్చారు. సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలంటూ విజ్ఞప్తి చేశారు. జడ్పీ సీఈవో చేసిన విజ్ఞప్తితో సంతృప్తి చెందని అధికార పార్టీ జడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌తో సహా సమావేశాన్ని బహిష్కరించి కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో వారిని తిరిగి హాల్లోకి తీసుకువచ్చేందుకు అటూ అధికారులు, జిల్లా పరిషత్ ఛైర్మన్ బుజ్జగింపులు చేపట్టారు.
ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగాల్సిన వేదిక అధికార పార్టీ సభ్యుల నిరసనలతో రసాభాసగా మారింది. చాలా సేపు బుజ్జగింపుల అనంతరం సభ్యులు ఆందోళనను విరమించి సమావేశ గదిలోకి వచ్చారు. చర్చ ప్రారంభం కాగానే గ్రామ పంచాయతీలలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా పరిషత్ ఛైర్మన్ ప్రస్తావించారు. దానిపై ప్రతిపక్ష జడ్పీటీసీ సభ్యులు హరివర్ధన్ రెడ్డి ఇదే సమస్యపై అంతకుముందు తాను ప్రస్తావించానన్నారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు తప్ప... రాష్ట్ర సర్కార్ పైసా ఇచ్చిన పాపాన పోలేదంటూ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నానని తెలిపారు.