కృష్ణా జిల్లా నూజివీడు మండలం పాతరావిచర్లలో... పోలింగ్ కేంద్రంలోకి వాలంటీర్ పదేపదే వెళ్లటం వివాదానికి దారితీసింది. కుటుంబసభ్యులకు సాయం చేసే నెపంతో వస్తున్న వాలంటీర్‌కు పోలీసులు హెచ్చరిక జారీచేశారు. ఈ విషయంపై వాగ్వాదం తలెత్తగా.. స్థానికులకు పోలీసులు నచ్చజెప్పారు. వాలంటీర్ ప్రవేశంపై మరో వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ తరుణంలో.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని వాలంటీర్‌కు పోలీసులు గట్టిగా చెప్పగా.. ఆయన అక్కడి నుంచి వెనుతిరిగాడు.
గంపలగూడెం మండలం పెనుగొలనులో ఓ అభ్యర్థి ఎన్నికలను బహిష్కరించారు. తనను స్థానిక తెదేపా నేత మోసం చేశాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తమ తరఫున ఏజెంట్ సైతం ఉండరని చెప్పారు.
గుంటూరు జిల్లాలో...
సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడులో... పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాలు గొడవ పడ్డాయి. పోలింగ్ కేంద్రం పరిసరాల్లోకి ప్రవేశిస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకోవటం వాగ్వాదానికి దారి తీసింది. గొడవ పడుతున్న రెండు వర్గాలకు పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
ప్రకాశం జిల్లాలో...
మార్కాపురం మండలం దరిమడుగులో... ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలతో సర్పంచ్ బరిలో ఉన్న వ్యక్తి ఆందోళన చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన తహసీల్దార్ విద్యాసాగరుడుని అడ్డుకున్నారు. దరిమడుగు పంచాయతీ పరిధిలో రెండు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల ఓట్లు భారీగా ఈ పంచాయతీలో ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు వీరి ఓట్లను దగ్గరుండి వేయిస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై.. ఓ వర్గం వ్యక్తులు తహసీల్దార్‌ను ప్రశ్నించటం వాగ్వాదానికి దారితీసింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఐడీ లు సరిగా లేవనే కారణంతో వెనక్కి తిరిగి పంపించటంపై మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల చొరవతో సమస్య పరిష్కారమైంది.
చిత్తూరు జిల్లాలో...
శ్రీకాళహస్తి మండలం రాచగున్నేరిలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒక ఓటు విషయమై... పోలింగ్ కేంద్రం ఎదుట ఇరువర్గాల అనుచరులు వాగ్వాదానికి దిగారు. పంచాయతీలో నివసించని వ్యక్తులు... ఓటు ఎలా వేస్తారంటూ అధికార పార్టీ మద్దతుదారులను... మరో వర్గం వారు అడ్డుకున్న కారణంగా... ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కందులవారి పల్లిలో కొంతమంది నకిలీ ఓట్లు వేసేందుకు యత్నించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లు వారిని గుర్తించడంతో గుట్టురట్టయింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... నకిలీ ఓటర్లను తిరిగి వెనక్కి పంపించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
నిడదవోలు మండలం గుణపర్రులో పోలింగ్ సమయంలో వివాదం తలెత్తింది. వైకాపాకు చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. రిగ్గింగ్‌కు పాల్పడతున్నారంటూ ఇరువర్గాలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. కొంత సేపు పోలింగ్ నిలిపేశారు. నరసాపురం సబ్ కలెక్టర్ విశ్వనాథన్ గుణపర్రు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వృద్ధురాలి ఓటును పీఓ నే బలంవంతంగా వేయించారని... ఓ అభ్యర్థి వర్గం ఆందోళన చేసింది. ఈక్రమంలో పీఓ ను పోలింగ్ కేంద్రం నుంచి తోసేశారని.. అందువల్లే పోలింగ్ కాసేపు నిలిపేశామని ఉన్నతాధికారులు చెప్పారు. వెంటనే ఆ సిబ్బందిని తొలగించి, కొత్తసిబ్బందిని ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయించామన్నారు.
కర్నూలు జిల్లాలో...
ఆలూరులో పోలింగ్ కేంద్రం వద్ద సర్పంచ్ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారంటూ మరో అభ్యర్థి తన అనుచరులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో...
రణస్థలం మండలం జీరుపాలెం పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరికి గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పకుండా గట్టి చర్యలు తీసుకున్న పోలీసులు.... రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.
ఇదీ చదవండి: ఊరికోసం సొంత ఖర్చులతో ఎన్ఆర్ఐ సేవలు.!