టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి ఇంటిని కాంగ్రెస్ నేతలు ముట్టడించేందుకు యత్నించారు. కాంగ్రెస్ దళిత విభాగం ఛైర్మన్ ప్రీతమ్ ఆధ్వర్యంలో.. బుధవారం రాత్రి హస్తం పార్టీ నేతలు మంత్రి ఇంటి వద్ద ధర్నా చేశారు. రేవంత్‌రెడ్డికి.. మంత్రి మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను అడ్డుకున్నారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు.. మంత్రి ఇంటివద్ద పోలీసు బలగాలను మోహరించారు. మల్లారెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన 20 మంది కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రేవంత్ ఏమన్నారంటే..
మంత్రి మల్లారెడ్డికి యూనివర్శిటీకి ఇచ్చిన భూమిపై పీసీసీ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు చేశారు. తప్పుడు పత్రాలతో మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని ఆరోపించారు. మల్లారెడ్డి భూ అక్రమాలపై సీఎం కేసీఆర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి నిర్దోషి అని తేలితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఘాటుగా స్పందించిన మంత్రి..
మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తమ విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని వెల్లడించారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.
రేవంత్‌కు సవాల్..
‘‘'ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ సవాల్ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తాను. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. రేవంత్ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో'’అని రేవంత్‌రెడ్డికి మల్లారెడ్డి సవాల్ విసిరారు.
సంబంధిత కథనాలు: