అగ్నిపథ్‌పై ఆందోళనల్లో నలుగురికి బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఛాతీలో గాయమైన వ్యక్తి పరిస్థితి కొంచెం విషమంగా ఉందని.. శస్త్ర చికిత్స చేస్తున్నామని వివరించారు. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాధితులకు తగిలినవి రబ్బర్ బుల్లెట్లా లేక నిజమైన బుల్లెట్లా అన్న విషయం ఇంకా తెలియలేదని స్పష్టం చేశారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మృతుడికి పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు.
మరోవైపు ఆందోళనకారుల నిరసనల్లో నాలుగు కోచ్‌లు పాక్షికంగా దగ్ధమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్-పాక్షిక కోచ్, అజంతా రెండు పాక్షిక కోచ్‌లు, రాజ్‌కోట్ ఒక కోచ్.. పాక్షికంగా దగ్ధమైనట్లు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో ఇప్పటి వరకు 72 రైళ్లు రద్దు కాగా.. 12 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. మూడింటిని దారి మళ్లించారు.