temperature rise in India 2021 : ఉష్ణోగ్రతల పెరుగుదలతో తలెత్తే విపరిణామాల గురించి అప్రమత్తం చేసిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక (యూఎన్‌ఈపీ(united nations environment programme)).. వాటి నుంచి బయటపడేందుకు వివిధ దేశాలు అనుసరిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలనూ విశదీకరించింది. ముప్పు పొంచి ఉన్న ఇతర చోట్లా పాటించాల్సిన పద్ధతుల గురించి వివరించింది. ఉష్ణోగ్రతలు, కర్బన ఉద్గారాలు తగ్గించుకొనేందుకు, కాలుష్యం బారిన పడకుండా చూసుకొనేందుకు ఆయా దేశాలు చేపట్టిన చర్యలతో కొన్ని చోట్ల నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. గ్రీన్ కారిడార్ల ఏర్పాటు, నీటి ప్రవాహ మార్గాలను పునరుద్ధరించడం, విద్యుత్తుతో నడిచే బస్సులు ఇలా.. తాప ఉపశమన విధానాలను అనుసరించి ఫలితాలు రాబట్టవచ్చని తెలిపింది. తీవ్ర రూపం దాల్చుతున్న ఉష్ణోగ్రతలు, వాటి పర్యవసానాల నుంచి ఈ చర్యల ద్వారా సాంత్వన పొందొచ్చని వెల్లడించింది.
Electric buses in China : ప్రజారవాణా అంతా విద్యుత్తు బస్సులే
చైనాలోని షెన్‌జెన్ వేగంగా విస్తరిస్తోన్న నగరం. జనాభా కోటి 20 లక్షలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం నుంచి బయట పడేందుకు ఇక్కడ విద్యుత్తు బస్సుల వినియోగాన్ని ప్రారంభించారు. 2016-17 నుంచి పూర్తి స్థాయిలో ఈ-బస్సుల విధానాన్ని అమలు చేశారు. ఇందుకు ప్రభుత్వం, నగరపాలక సంస్థలు భారీగా రాయితీలు ఇచ్చాయి. డీజిల్ బస్సు కంటే 36 శాతం తక్కువకు విద్యుత్తు బస్సు సంబంధిత కార్పొరేషన్‌కు లభించేలా చర్యలు తీసుకున్నారు. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనేక చోట్ల భూములు కేటాయించారు. ఈ చర్యల వల్ల 48 శాతం కార్బన్ డై ఆక్సైడ్ తగ్గడమే కాదు.. శబ్ద కాలుష్యం(sound pollution in India) సహా అనేక రకాల కాలుష్యాలు తగ్గాయని నివేదిక తెలిపింది.
చేపట్టాల్సిన చర్యలివే..
- పెరిగే ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా వేడిని తట్టుకొనేందుకు నగరాలు, పట్టణాల ప్రణాళికలో, భవన నిర్మాణాల్లో పలు మార్పులు చేయాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కిచెప్పింది. వేడిని తట్టుకొనేలా పట్టణ ప్రణాళిక, దీనికి తగ్గట్టుగా మౌలిక వసతుల నిర్మాణం జరగాలి.
- తక్కువ విద్యుత్తు వినియోగంతోపాటు భవనాల నుంచి తక్కువ ఉద్గారాలు వెలువడేలా ఉండాలి. నిర్మాణంలోనే భవనం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. మెకానికల్ కూలింగ్‌ను తగ్గించాలి.
- పట్టణ ప్రణాళిక, విద్యుత్తు, రవాణాశాఖల మధ్య సమన్వయం అవసరం. భవన నిర్మాణంలో గ్రీన్ స్పేస్ ఆవశ్యకతను గుర్తించాలి. ఐరాస పర్యావరణ పరిరక్షణ సంస్థ 2021 నివేదిక ప్రకారం ఇళ్ల చుట్టూ ఓపెన్ గ్రౌండ్ ఉండటం కన్నా చెట్లు ఉంటే ఉష్ణోగ్రతలో ఐదు డిగ్రీల తేడా ఉంటుంది.
- బిల్డింగ్ కోడ్స్‌ను తప్పనిసరి చేయాలి. ఉదాహరణకు అమెరికాలో మోడల్ ఎనర్జీ కోడ్స్ అమలుతో 2010 నుంచి 2040 మధ్య 841 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను మినహాయించవచ్చు. దీంతోపాటు 3757 టెరావాట్ హవర్స్ విద్యుత్తు వినియోగాన్ని ఆదాచేయొచ్చు. ఈ మేరకు ఆదా చేయడం అంటే 177 మిలియన్ ప్యాసింజర్ వాహనాలు ఏడాది పాటు విడుదల చేసే కర్బన ఉద్గారాలను ఆపినట్లే.
- చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బిల్డింగ్ కోడ్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం, అమలు చేయడం తక్కువగా ఉంది. పునరుత్పాదక విద్యుత్తు వినియోగం కూడా తక్కువే. ది రెగ్యులేటరీ ఇండికేటర్స్ ఫర్ సస్టెయినబుల్ ఎనర్జీ (రైస్) డేటా ప్రకారం 65 తక్కువ/మధ్యస్థ ఆదాయం గల దేశాల్లో 16 చోట్ల మాత్రమే ఎనర్జీ ఎఫీషియన్సీ కోడ్స్ కొత్త భవనాల నిర్మాణాలకు ఉన్నాయి.
- ఆర్థికపరమైన సమస్యలు, వ్యవస్థల సామర్థ్యం పరిమితంగానే ఉండటం మొదలైన వాటి వల్ల ప్రత్యామ్నాయాలకు సమస్యలు ఎదురవుతున్నాయని నివేదిక పేర్కొంది.
- కొత్త నగరాల ఏర్పాటులో ముందుగానే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడంతోనూ ఫలితాలు వచ్చాయంటూ జుజాంగ్‌ను ఉదాహరణగా నివేదిక పేర్కొంది. ఈ నగరంలో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని తెలిపింది.
- పారిస్, టొరంటో ఇలా అనేక చోట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శీతల (కూలింగ్) వ్యవస్థల వల్ల మంచి ఫలితాలు వచ్చినట్లు నివేదిక తెలిపింది.
- దక్షిణ కొరియాలోని సియోల్‌లో నగరం ద్వారా వెళ్లే వాగును పునరుద్ధరించేందుకు 5.8 కిలోమీటర్ల దూరం ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేను ఏర్పాటుచేశారు. వాటర్ ఫ్రంట్ కారిడార్‌నూ నెలకొల్పారు.
- వెస్ట్రన్ సిడ్నీలో నగరపాలక సంస్థ, ప్రజలు, వివిధ సంస్థలు 2018 నుంచి ప్రత్యేకంగా చేపట్టిన కార్యాచరణ, వియత్నాంలోని హనోయ్‌లో పట్టణీకరణను తట్టుకొనేందుకు నెలకొల్పిన గ్రీన్ కారిడార్‌తో మంచి ఫలితాలు వచ్చాయి.
- గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి, అహ్మదాబాద్‌లో చేపట్టిన చర్యలను నివేదిక వివరించింది.
నాలుగు డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రత..
కొలంబియాలోని మెడిలిన్‌లో గత వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేశారు. 2016 నుంచి 2019 వరకు నగరంలో 36 గ్రీన్ కారిడార్లను నెలకొల్పారు. ఇందులో 18 రోడ్ల వెంబడి కాగా, మరో 18 నీటి ప్రవాహ మార్గాల పక్కన. 80 కి.మీ దూరం సైకిల్ మార్గం ఏర్పాటు చేశారు. 2019 నుంచి ప్రజారవాణా కోసం విద్యుత్తు బస్సుల వినియోగాన్ని పెంచారు. ఇలా 2016-19 మధ్య తీసుకొన్న చర్యలతో ఈ ప్రాంతంలో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.