Women Bike Rally: ఏపీలోని ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు తెలుగు మహిళలు కదం తొక్కారు. ప్రతీ మహానాడుకు యువత, కుర్రకారు బైక్ ర్యాలీలతో సందడి చేయటం సహజమే. ఈసారి అందుకు భిన్నంగా మహిళలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
మహా ప్రభంజనంలా తెలుగుదేశం మహానాడు తొలురోజు వేడుక మహోత్సవంలా ప్రారంభమైంది. ఒంగోలు వీధులు ఎటు చూసినా పసుపు తోరణాలతో అతిథులకు స్వాగతం పలికాయి. ఉదయం ఆరుగంటల నుంచి ప్రాంగణానికి తండోపతండాలుగా పసుపు శ్రేణులు తరలివచ్చారు. ప్రతినిధుల నమోదు ప్రారంభం కాకముందే ముందవరుస కుర్చీలు నిండిపోయాయి. తొలిరోజు సమావేశానికి 12వేల మంది ప్రతినిధులు మాత్రమే వస్తారన్న పార్టీ అంచనాలకు మించి.. సభా ప్రాంగణం కిక్కిరిసింది. జాతీయ రహదారి నుంచి దాదాపు 500మీటర్లు దూరంగా మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినా.. సభా వేదిక నుంచి రహదారి వరకూ ఎక్కడ చూసినా కార్యకర్తలూ, శ్రేణులే కనిపించారు.
రేపటి బహిరంగ సభకు 2లక్షలమంది వస్తారని పార్టీ అంచనా వేస్తుండగా.. తొలిరోజు కార్యక్రమంలోనే ఆ స్థాయి జోష్ ఉరకలెత్తింది. ప్రాంగణ పరిధిలో ఎక్కడ చూసినా కార్యకర్తలే గుంపులు గుంపులుగా కనిపించారు. చంద్రబాబు ప్రత్యేక భద్రతా సిబ్బంది, పోలీసులు, పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఇవేవీ కార్యకర్తల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. చంద్రబాబు ప్రత్యేక వాహనంపైకి కూడా ఎక్కేసి మహానాడును వీక్షించేందుకు ఉవ్విళ్లూరారు. దీంతో ముఖ్యనాయకులు, నేతలకు సైతం మహానాడు స్టేజి ఎక్కేందుకు కష్టతరంగా మారింది.
ఇవీ చదవండి: