Corona Vaccination Telangana : రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీ 4 కోట్ల డోసుల మైలురాయిని చేరింది. గురువారం ఉదయానికి ఈ ఘనత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారు 2.77 కోట్ల మంది ఉండగా.. 2.61 కోట్ల మంది (94శాతం) తొలి డోసు తీసుకున్నారు. రెండో డోసును మాత్రం 1.39 కోట్ల మందే (50శాతం) పొందారు. ఇప్పటివరకు టీకాపై ఆసక్తి చూపని వారు సైతం.. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కలకలంతో టీకాల కోసం కేంద్రాలకు వస్తున్నారు. గడువు ముగిసినా రెండో డోసు పొందనివారు వెంటనే తీసుకోవాలని వైద్యఆరోగ్యశాఖ సూచిస్తోంది.
Corona Vaccination Telangana 2021 : మున్సిపాలిటీలు, పంచాయతీల సహకారంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ టీకాలు వేస్తోంది. పంపిణీ అయిన టీకాల్లో 87 శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో, 13 శాతం ప్రైవేటు కేంద్రాల్లో పంపిణీ అయ్యాయి. టీకా పంపిణీలో రాష్ట్ర సగటు కన్నా 19 జిల్లాల సగటు తక్కువగా ఉంది. ఏజెన్సీ జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. తొలిడోసు సగటులో మెరుగైన స్థానాల్లో ఉన్న జిల్లాలు సైతం రెండో డోసు పంపిణీలో వెనుకబడ్డాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, హనుమకొండ జిల్లాల్లో ప్రజల సంఖ్య కన్నా ఎక్కువ టీకాలు పంపిణీ అయ్యాయి. హైదరాబాద్ ఖాజా గార్డెన్‌లోని 24 గంటల టీకా కేంద్రానికి అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
4 Crore Corona Vaccine Doses Distribution : అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా కృషి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ నాలుగు కోట్ల మార్కు దాటడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌పై పోరులో ముందడుగు వేసిన వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు.