Telangana Weather Updates : రాష్ట్రంలో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ గురువారం పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
Telangana Rains News : హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
మహానగరంలో వాగులైన రహదారులు.. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో రోడ్లు వాగులను తలపించాయి. కాప్రాలో గరిష్ఠంగా 7.5 సెంటీమీటర్లు, మల్కాజిగిరిలో 6.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. యాదాద్రి జిల్లా మోటకొండూరులో 6.8 సెం.మీ, నిర్మల్ జిల్లా పెంబిలో 6.4, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 6.2 సెం.మీ. వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి.