GST Collections in Telangana for April: ఏప్రిల్ నెలలో తెలంగాణ రికార్డు స్థాయిలో వస్తు, సేవల పన్ను వసూళ్లు సాధించింది. 2107లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాటి నుంచి మొట్టమొదటి సారిగా భారీ స్థాయిలో ఆదాయం నమోదైంది. గత నెలకు గాను దాదాపు రూ. 5000 కోట్ల రాబడిని సాధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు గాను తెలంగాణ రూ. 4,955 కోట్ల జీఎస్టీ వసూళ్లను సాధించినట్లు కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది.
దీంతో దేశంలోనే అత్యధిక జీఎస్టీ రాబడులను సాధించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చేరింది. మహారాష్ట్ర- రూ. 27,495 కోట్లు, కర్ణాటక- రూ. 11,820 కోట్లు, గుజరాత్- 11,264 కోట్లు, ఉత్తరప్రదేశ్- రూ. 8,534 కోట్లు, తమిళనాడు- రూ. 9,724 కోట్లతో మొదటి ఐదు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ రూ. 4,955 కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ తెలంగాణ ఈ రీతిలో వృద్ధి నమోదు చేసుకోలేదని వెల్లడించింది. 2021 ఏప్రిల్లో వచ్చిన జీఎస్టీతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని వెల్లడించింది.
తాజా గణాంకాల ప్రకారం గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఏప్రిల్ 2021లో రాష్ట్రం రూ. 4000 కోట్ల మార్కును దాటింది. కాగా ఈ ఒక్క ఏడాదిలోనే రూ. 1000 కోట్ల మేర వస్తు, సేవల పన్ను రాబడులు పెరిగాయి. ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ, సెస్, ఇతర జీఎస్టీ సంబంధిత పన్నుల రూపంలో 2018లో రూ. 3,040 కోట్ల రాబడులు సాధించగా.. అప్పటివరకూ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు అధికంగా రూ. 2,800 కోట్లు మాత్రమే.
GST Collections in April: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ చూడనంతగా వసూళ్లు వచ్చాయి. 2022 ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42లక్షల కోట్లు.. రెండో అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్లో.. రూ.25 వేలు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని వివరించింది. 2021 ఏప్రిల్లో వచ్చిన జీఎస్టీతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని స్పష్టం చేసింది. ఏప్రిల్లో వసూలైన రూ.1,67,540 కోట్లలో.. సీజీఎస్టీ రూపంలో రూ.33,159 కోట్లు, ఎస్జీఎస్టీ రూపంలో రూ.41,793 కోట్లు వసూలయ్యాయి. సమీకృత జీఎస్టీ కింద రూ.81,939 కోట్లు వచ్చాయి. సెస్ రూపంలో రూ.10,649 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది.
ఇవీ చదవండి: 'కరోనా టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దు'