తెలంగాణ ఆర్టీసీ కార్మికులు డిమాండ్లను సాధించుకోవడానికి చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపాలని కోరుతూ ఐకాస నాయకులు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు.
కొలువు పోయిందన్న బాధలో...
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటకు చెందిన నాగేశ్వర్ అనే ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమ్మెపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో మనోవేదనకు గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇతను మూడు సంవత్సరాల క్రితమే రెగ్యులర్ ఎంప్లాయిగా బాధ్యతలు స్వీకరించాడు.
జీతం రాకపాయే.. పూట గడవకపోయే.. అదే మనాది..
ఇదిలా ఉండగానే టీవీలో వార్తలు చూసి... హైదరాబాద్ మంథని డిపోకు చెందిన కండక్టర్ సమ్మయ్య తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గుండెపోటు రావడం వల్ల బంధువులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
కార్మికుడికి అస్వస్థత
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపో వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా డిపో ఎదుట గంటపాటు బైఠాయించారు. ఈ సమయంలో ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో అతడిని ఆస్పత్రికి తరలించారు.
జిల్లాలు - ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు
- హైదరాబాద్‌లో పలు డిపోల ముందు ఐకాస నాయకుడు రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ వైఖరి వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత వీ.హనుమంతరావు మండిపడ్డారు.
- ఖమ్మం బస్ డిపో ఎదుట దీక్షలు చేస్తున్న కార్మికులకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సంఘీభావం తెలిపారు.
- ఆర్మూర్‌లో కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మద్దతు తెలిపారు. భద్రాచలంలో ఎమ్మెల్యే పోదెం వీరయ్య కార్మికులతో పాటు నిరాహార దీక్ష చేపట్టారు.
- నిజామాబాద్ జిల్లా నవీపేటలో కార్మికులు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో కార్మికులు ర్యాలీ నిర్వహించి.. మానవహారం చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
- డ్రైవర్ నరేశ్ మృతికి నిరసనగా.. మహబూబాబాద్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జామునుంచే కార్మికులు, అఖిలపక్ష కార్యకర్తలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందగా బంద్ పాటించాయి.
- వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో నాలుగు గంటలపాటు డిపో ఎదుట బైఠాయించారు. తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వహించవద్దంటూ నినాదాలు చేశారు.
- సిద్దిపేట బస్‌డిపో ఆవరణలో డ్రైవర్లు కండక్టర్లు యూనిఫారం వేసుకొని నిరసన దీక్ష చేపట్టారు. వారికి కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు మద్దతు ప్రకటించారు.
- యాదాద్రి భువనగిరి జిల్లాలో కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్‌లో మృతి చెందిన డ్రైవర్ నరేశ్‌కు పలువురు భాజపా నాయకులు నివాళులర్పించారు. కార్మికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.