Bus Charges Hike in Telangana : విద్యుత్తు ఛార్జీల పెంపు తప్పదని సోమవారం తేలిపోయింది. ఇప్పుడిక ఆర్టీసీ ఛార్జీల వంతుగా ఉంది. విస్తృత మేధోమథనం తరవాత కిలోమీటరుకు 25 పైసల చొప్పున పెంచాలన్న ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి వెళ్లింది. అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తరవాత పెంపు ప్రకటన ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి తర్వాతే ప్రకటన..
Bus Fare Hike in Telangana : ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలను 2019 డిసెంబరు 5న పెంచారు. తరవాత నుంచి డీజిల్ ధరలు భారీగా పెరగటంతో ఛార్జీలను పెంచాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద నలుగుతోంది. ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలు పెచ్చుమీరటంతో ఛార్జీల పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇవ్వటం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు.
ప్రాథమిక ప్రతిపాదనలు..
TSRTC Bus Fare Hike : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై అధికారులు ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పల్లెవెలుగు బస్సులకు కిలోమీటర్ కు రూ.25 పైసలు, ఎక్స్‌ప్రెస్ ఆపైన బస్సులకు కిలోమీటర్‌కు రూ.30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్‌కు రూ.25 పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఆపై సర్వీసులకు రూ.30పైసలు పెంచాలని నిర్ణయించి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపారు. త్వరలో అనుమతి లభిస్తుందని ఎదురుచూస్తున్నారు.
నష్టాలు కొంత తగ్గే అవకాశం..
Bus Ticket Fare Hike in Telangana : గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టీసీకీ రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా వల్ల కొద్దిరోజులు నష్టాలు వస్తే.. పెరిగిన డీజీల్ ధరలతో మరికొన్ని నష్టాలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడుతుంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచితే.. ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది. తద్వారా ఆర్టీసీ తిరిగి గాడినపడే అవకాశాలున్నట్లు అధికారులు ఆకాంక్షిస్తున్నారు.