రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 411 కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష... మధ్యాహ్నం ఒకటిన్నర వరకు సాగింది. ఉదయం నుంచే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. విద్యాశాఖ ఆవిష్కరించిన ఎస్బీటీఈటీ మొబైల్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రం లొకేషన్‌ను విద్యార్థులు సులభంగా తెలుసుకున్నారు.
ఈస్ట్ మారేడ్‌పల్లిలో...
సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో ఉన్న ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్ కళాశాల పరిధిలో ఉన్న 10 సెంటర్లలో దాదాపు రెండు వేల 400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు ప్రిన్సిపల్ వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు మస్కులు ధరిస్తేనే లోపలికి అనుమతించినట్టు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
మేడ్చల్ మండలంలో...
మేడ్చల్ మండలంలోని 9 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1459 మంది విద్యార్థులు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనల మేరకు ప్రతి విద్యార్థి ఉష్ణోగ్రత తనిఖీ చేసి.. మాస్కులు ధరిస్తేనే కేంద్రంలోకి అనుమతించారు. కరోనా విజృంభణ తరువాత మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న పరీక్షకు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటిస్తూ కేంద్రంలో కుర్చీలు ఏర్పాటు చేశారు.
రామంతాపూర్‌లో..
రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో.. 2609 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్ నేపథ్యంలో మొదటి పరీక్ష కావడం వల్ల కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది లక్ష 2 వేల 496 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 58 వేల 616 మంది బాలురు, 43 వేల 880 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందులో ఇంజినీరింగ్ కోసం 64,898, అగ్రికల్చర్ కోసం 37,598 మంది దరఖాస్తు చేసుకున్నారు.