తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ.. అధికారులను ఆదేశించారు. బోనాల ఏర్పాట్లపై దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి సహా అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.
భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని.. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. భౌతిక దూరం పాటించడం సహా మాస్కులు ధరించి దర్శనాలు చేసుకోవాలని.. భక్తులకు సూచించారు. ఆలయాల వద్ద మాస్కులు, శానిటైజర్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
బోనాల నిర్వహణ కోసం పలు ఆలయాలకు ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.15 కోట్ల మంజూరు చేశారని.. ఆ నిధులను సద్వినియోగం చేసుకొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఉత్సవాల నిర్వహణ, ఆలయాల అలంకరణ, పూజా కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సకాలంలో ఆలయ కమిటీలకు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.
అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలని ఆదేశించారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆలయాలతో పాటు జంట నగరాల్లోని ప్రముఖ ప్రదేశాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలి.. అధికారులకు.. మంత్రులు సూచించారు.
ఇదీచూడండి: అది డ్రోన్ల రిమోట్ కంట్రోల్ కాదు.. న్యూస్ పేపర్ల కట్ట!