ఆంధ్ర నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అన్యాయం చేసిన వారే.. ఇప్పుడు పరుష పదజాలం వినియోగిస్తున్నారన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అంజయ్య యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డిలతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
గత సీఎంలు మీకు దేవుళ్లు కావొచ్చు..
ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌కు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. మీ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు, ప్రాజెక్టులు కట్టారు కాబట్టి గత సీఎంలు మీకు దేవుళ్లు కావొచ్చని శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. మాకు అన్యాయం చేశారు కాబట్టే ఆవేదనలో కొన్ని మాటలు అన్నామన్నారు. కడుపు మండి నిజాలు మాట్లాడితే ఆంధ్రా నేతలకు ఉలికిపాటు ఎందుకని మంత్రి ప్రశ్నించారు. పాలమూరును ఎడారి చేస్తామంటే తామేలా ఒప్పుకుంటామని ఏపీ నేతలను నిలదీశారు.
'సీనియర్ నేత మీరు.. ఇలా మాట్లాడతారా.. '
ఏపీలో సీనియర్ నేత రామచంద్రయ్య వైషమ్యాలను రెచ్చగొట్టడం తగదని శ్రీనివాస్‌గౌడ్ హితవు పలికారు. తమకు రాజకీయాలు లేకున్నా పర్వాలేదని.. ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా నీళ్ల దోపిడిపై మాట్లాడుతూనే ఉంటామన్నారు. పాలమూరు ప్రాంతానికి నీళ్లు వచ్చాయని సంబురపడేలోపే... దోచుకెళ్తున్నారని ఆరోపించారు. తమ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోమని... అన్ని రకాలుగా ప్రాజెక్టును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
అదే తమ అభిమతం..
రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ అనే బేషజాలు లేకుండా హైదరాబాద్‌లో అందరం కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు శాంతియుతంగా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు.. ఏపీ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నించాలని సూచించారు.
ఆ ప్రాజెక్టు వైఎస్ కట్టింది కాదు..
కాళేశ్వరం ప్రాజెక్టు.. వైఎస్ కట్టింది కాదని... కేసీఆర్ మేథోశక్తితో కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలపై కేంద్రం ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. అన్యాయానికి గురవుతున్న తెలంగాణకు జాతీయ పార్టీలు అండగా నిలవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
ఆంధ్ర నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. రెచ్చగొట్టినట్లు వ్యాఖ్యలు చేయడం తగదు. అన్యాయం చేసిన వారే... ఇప్పుడు పరుష పదజాలం వాడుతున్నారు. ఆంధ్రలో అభివృద్ధి చేశారు కాబట్టి గత సీఎంలు మీకు దేవుళ్లు కావొచ్చు. మాకు అన్యాయం చేశారు కాబట్టి ఆవేదనలో మాటలు అంటాం. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌కు తీరని అన్యాయం చేశారు. అన్యాయం చేశారు కనుక మా మాటలు పడాలి. పాలమూరుకు నీళ్లు వచ్చాయని సంబురపడేలోపే దోచుకెళ్తున్నారు. మా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోం.
- శ్రీనివాస్‌గౌడ్, మంత్రి
ఇదీచూడండి: RDS Controversy: 'సీమ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు'