రాష్ట్రంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలు రేపట్నించి తెరచుకోనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవల సంస్థలు తెరచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం, కంటైన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో ఇప్పటి వరకు నిషేధించిన వాటిలో థియేటర్లు, గేమింగ్ పార్కులు మినహా అన్నింటిని రేపటి నుంచి తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 8 నుంచి తెరిచేందుకు అనుమతించిన సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలతో కూడిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.
ట్రైల్ రూమ్‌లకు అనుమతి లేదు
రేపట్నుంచి షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కూడా అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లు పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. హోటల్స్, రెస్ట్రారెంట్లు, ఆతిథ్య సేవల సంస్థల్లోకి వెల్లే ముందు ప్రవేశ ద్వారం వద్దనే నిర్వహకులు శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరని పేర్కొన్న ప్రభుత్వం కరోనా లక్షణాలు లేనివారికే ప్రవేశం కల్పించాలని పేర్కొంది. షాపింగ్ మాల్స్ నిర్వహకులు తగినంత భౌతిక దూరం ఉండేట్లు చూడాలని, ట్రైల్ రూమ్‌లకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
సగం మందిని మాత్రమే
ప్రార్థనా మందిరాల్లోకి వెళ్లే ముందు చేతులు కడుక్కోడానికి సబ్బు, నీటిని అందుబాటులో ఉంచేట్లు చూడాలని, చెప్పులు పెట్టుకోడానికి తగిన ప్రదేశాన్ని మందిరాలకు బయట ఏర్పాటు చేయాలని పేర్కొంది. రెస్ట్రారెంట్లల్లో పార్సెల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, పార్సెల్స్ చేరవేసే వారిని థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని, పార్సెల్స్‌ను నేరుగా చేతికి ఇవ్వకుండా తలుపు దగ్గర పెట్టి రావాలని వివరించింది. రెస్ట్రారెంట్లల్లో ఉన్న సీట్లల్లో సగం మందిని మాత్రమే అనుమతించాలని పేర్కొంది.
ఈ వివరాలు తప్పనిసరి
హోటల్స్‌లో ఉండేందుకు వచ్చే వారికి చెంది గుర్తింపు కార్డు, వ్యక్తిగత పూచీకత్తులతోపాటు పూర్తి వివరాలను, ప్రయాణానికి సంబంధించిన వివరాలు, మెడికల్ కండిషన్ లాంటివి అడిగి తెలుసుకోవాలన్నారు.