KTR On Data Science: దేశంలో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యమివ్వలేదని.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ కారణంగా డేటా సైన్స్ రంగంలో దేశం వెనకబడిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే ఈ రంగం వేగం పుంజుకుంటోందని వివరించారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డేటాసైన్స్ కంపెనీ గ్రామినర్ నూతన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నానక్‌రాం గూడాలోని వన్ వెస్ట్ బిల్డింగ్‌లో గ్రామినర్ డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. డేటా నిల్వ, అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రంగానికున్న ప్రాధాన్యతను మనదేశం ఆలస్యంగా గుర్తించిందన్నారు. డేటా సైన్స్, మానవ వనరుల ప్రోద్బలంతో సమగ్ర కుటుంబ సర్వే వంటి అతిపెద్ద ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఒక్కరోజులో పూర్తి చేయగలిగిందని కేటీఆర్ గుర్తు చేశారు.
గ్రామినర్తో కలిసి పనిచేస్తాం..
పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, భాగస్వామ్యం కోసం డేటా సైన్స్ ఆవశ్యకత ఉందన్న మంత్రి.. ఇరిగేషన్, మున్సిపల్ శాఖల్లోని పలు ప్రాజెక్టుల కోసం గ్రామినర్తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఈమేరకు డేటా సైన్స్ నిర్వహణలో వ్యవసాయం, మొబిలిటీ, ఇండస్ట్రీ ఏరియాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు గ్రామినర్ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం గ్రామినర్కు 250 మంది ఉద్యోగులు ఉండగా.. రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు నవీన్ గట్టు వెల్లడించారు.
'ప్రభుత్వ రంగంలో విస్తృతమైన డేటా ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే.. రెండేళ్ల క్రితం రూ.36 కోట్ల డేటా సెట్లను ప్రారంభించాం. ప్రస్తుతం ఇది చాలా ఎక్కువే ఉంటుంది. ప్రభుత్వంలో డేటాకు సంబంధించి ప్రజలకు ప్రయోజనం కల్పించే దిశలో విస్తృత అవకాశాలు ఉన్నాయి.'
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
ఇదీచూడండి: 'ప్రధాని మోదీ పవర్ఫుల్ లీడర్.. కానీ'