రాష్ట్రంలో మూడు జనపనార పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో వీటిని మూడు ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థలు స్థాపించనున్నాయి. గ్లోస్టర్ లిమిటెడ్, కాళేశ్వరం అగ్రో లిమిటెడ్, ఎంబీజీ కమాడిటీస్ లిమిటెడ్‌లు తెలంగాణలో రూ.887 కోట్లతో మూడు భారీ జూట్ (జనపనార) పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాదాపు 10,400 మందికి ఉపాధి కల్పిస్తామని ఒప్పందంలో పేర్కొన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ల సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, సంస్థల తరఫున హేమంత్ బంగూర్, బిజయ్ మంధాని, అశోక్ బర్మేచాలు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
20 ఏళ్ల వరకు జూట్ ఉత్పత్తుల కొనుగోలు: కేటీఆర్
అన్ని రంగాల్లో స్వయంసమృద్ధే సీఎం కేసీఆర్ సంకల్పం. రాష్ట్రంలో ఇప్పటి వరకు జూట్ మిల్లులు లేవు. ఒకేసారి మూడు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వాటిని ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. మిల్లుల్లోని ఉత్పత్తులను మొదటి 7 ఏళ్లు వంద శాతం, తర్వాత 5 ఏళ్లు 75 శాతం, మిగిలిన 8 ఏళ్లలో 50 శాతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అయిదేళ్ల పాటు జూట్ మిల్లులకు రవాణా రాయితీలు అందజేస్తాం. వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లోనే కాకుండా.. నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రతిపాదనలతో ఔత్సాహికులు ముందుకొస్తే తప్పకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. జూట్ ఉత్పత్తులతో పర్యావరణానికి మేలు జరుగుతుంది. వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తెస్తున్నాం. రైతులు ఎల్లప్పుడూ వరిపైనే ఆధారపడకుండా... ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తే సేద్యం లాభసాటిగా ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా మూడు పరిశ్రమలను సంస్థలు ప్రారంభించాలి.
వ్యవసాయశాఖ తరఫున ప్రోత్సాహం: నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా అవసరమైన జూట్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రత్యేక దృష్టి సారించారు. జనపనార పండించేలా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ తరఫున ప్రత్యేక కార్యమ్రాలను చేపడతాం. రాష్ట్రంలో పంటల దిగుబడి భారీగా వచ్చినందున గోనె సంచుల కొరత ఏర్పడింది. ఆ సమయంలో కేసీఆర్ జూట్ మిల్లుల ఏర్పాటుకు కేటీఆర్‌ను ఆదేశించారు. అది కార్యరూపం దాల్చింది. కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలు వినియోగించుకుని ఐటీ, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
గోనె సంచుల కొరత తీరుతుంది: గంగుల
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దార్శనికతతో తెలంగాణలో ఒక ప్రధాన సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. ప్రతీ పంట సీజన్లో దాదాపు 20 కోట్లకు పైగా సంచులు అవసరం కాగా ఈ సీజన్‌లో 35 కోట్ల వరకు డిమాండు ఉంది. కరోనా సంక్షోభంలో డబ్బులు చెల్లించినా కేంద్ర గన్నీ కార్పొరేషన్ మనకు సరిపడా సంచులను అందించలేకపోయింది. ఎఫ్‌సీఐ మార్గదర్శకాల మేరకు 54 శాతం గోనె సంచులను విధిగా వాడాలి. బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఏపీల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాం. కొత్త జూట్ పరిశ్రమల ద్వారా నిధులతో సమయం ఆదా అవుతుంది.