నిరుద్యోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే పోలీస్ నియామకాల్లో వయోపరిమితిని పెంచామని రాష్ట్ర హోంశాఖ మహమూద్ అలీ(Minister Mahmood ali) వెల్లడించారు. ఇప్పటివరకు 29వేల ఎస్సై, కానిస్టేబుల్ నియామకాలు చేపట్టామని తెలిపారు. కొండాపూర్ బెటాలియన్‌లో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 8వ బెటాలియన్ పాసింగ్ అవుట్పరేడ్కు హోంమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న 466 మంది కానిస్టేబుళ్లను అభినందించారు.
పటిష్ఠంగా పోలీసుశాఖ
రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుని పోలీస్ శాఖను పటిష్ఠం చేశారని మహమూద్ అలీ(Minister Mahmood ali) వివరించారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో భాగంగా కొత్త కమిషనరేట్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా బంజారాహిల్స్‌లో సకల సౌకర్యాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. రూ.700 కోట్లతో నూతన వాహనాలు సమకూర్చామని చెప్పారు.
నగరంలో ఏ ఘటన జరిగినా.. 5 నిమిషాల్లో పోలీసులు చేరుకునేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. షీటీమ్స్ ఏర్పాటుతో రాష్ట్రంలో మహిళలపై వేధింపులు తగ్గాయి. నేరాల అదుపు కోసం 7 లక్షల సీసీకెమెరాలు అమర్చాం. దేశంలో ఉన్న సీసీకెమెరాల్లో 64 శాతం తెలంగాణలోనే ఉన్నాయని గర్వంగా చెబుతున్నాం.
మహమూద్ అలీ, రాష్ట్ర హోంశాఖ మంత్రి
- ఇదీ చదవండి : LIVE VIDEO: శంషాబాద్ ఓఆర్ఆర్పై కారు దగ్ధం..