తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3.47 గంటలకు తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.
జస్టిస్ కేశవరావు 1961 మార్చి 29న జన్మించారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1986లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. పలు కీలకమైన సివిల్, క్రిమినల్ కేసులను విజయవంతంగా వాదించారు. 1991 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సీబీఐ, జీహెచ్ఎంసీ, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.
2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పి.కేశవరావు సేవలందించారు. ఆయన మృతితో హైకోర్టు.. నేడు రాష్ట్రంలోని కోర్టులకు సెలవు ప్రకటించింది. జస్టిస్ పి.కేశవరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. పేదలకు ఆయన అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు.
జస్టిస్ పి.కేశవరావు మంచి విలువలున్న మానవతావాది అని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కొనియాడారు. కేశవరావు కుటుంబసభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జస్టిస్ కేశవరావు మృతిపట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ సంతాపం ప్రకటించారు.
- ఇదీ చదవండి : జాతీయోద్యమంలో ఆఖరి సమ్మెట క్విట్ ఇండియా