high court on jagan case :జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసు నుంచి శ్రీనివాస్ రెడ్డితో పాటు హెటిరో గ్రూపును తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అరబిందో, హెటిరో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూమి కేటాయింపుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీనివాస్ రెడ్డి, హెటిరో సంస్థను నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. తమను కేసు నుంచి తొలగించాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి, హెటిరో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు చాలాకాలంగా హైకోర్టులో పెండింగులో ఉన్నాయి.
Hetero Quash Petitions: జగన్ కేసులకు సంబంధించిన పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభించిన హైకోర్టు.. మొదట శ్రీనివాస్ రెడ్డి, హెటిరో క్వాష్ పిటిషన్లపై వాదనలు విని ఇవాళ తీర్పును వెల్లడించింది. సీబీఐ అభియోగాల్లో నిజం లేదని.. జగన్ సంస్థల్లో పెట్టుబడులు వ్యాపార వ్యూహాల్లో భాగమేనని.. భూకేటాయింపుల్లో అక్రమాలేవీ జరగలేదని హెటిరో వాదించింది. జగన్ ప్రమేయంతో అప్పటి వైఎస్ సర్కారు హెటిరో సంస్థకు తక్కువ ధర భూమిని కేటాయించిందని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్లను కొట్టివేసింది.