తెలంగాణ హైకోర్టు(Telangana High Court Chief Justice) నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ(Justice Satish Chandra sharma) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai) ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana Chief Minister KCR), మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్ శర్మ ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుని ఓ హోటల్లో బసచేశారు. ఆయనకు పలువురు న్యాయాధికారులు, ప్రొటోకాల్ అధికారులు స్వాగతం పలికారు.
జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ(Justice Satish Chandra sharma) 1961 నవంబరు 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. 1981లో సాగర్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా, 1984లో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొందారు. మూడు బంగారు పతకాలు సాధించారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌చేసి రాజ్యాంగ, సర్వీస్, సివిల్, క్రిమినల్ కేసులు వాదించారు. 42 ఏళ్ల వయసులోనే 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ అడ్వయిజరీ బోర్డులో సభ్యులుగా జస్టిస్ శర్మ కొనసాగుతున్నారు. ఇటీవల కర్ణాటక సీజేగా ఉన్న అభయ్‌శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యి.. బాధ్యతలు చేపట్టారు.