రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్-1 ప్రకటన రాకపోవడం, మరోవైపు వయోపరిమితి మించిపోతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నూతన జోనల్ విధానం కింద సర్వీసు నిబంధనలు, పోస్టుల విభజన, క్షేత్రస్థాయి ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యేందుకు మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశాలున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ సివిల్ సర్వీసెస్, కేంద్ర, రాష్ట్ర పోటీ పరీక్షలకు ఉమ్మడి సిలబస్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
నిర్లక్ష్యనికి కారణాలేంటి...?
- తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటన కింద ప్రభుత్వం 138 పోస్టులు గుర్తించింది. ఈ మేరకు 2018 జూన్ 2న ప్రకటన వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. అదేసమయంలో కొత్త జోనల్ విధానం వచ్చే వరకు నియామక ప్రకటనలు నిలిపివేయాలంటూ ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి.
- ఆ తర్వాత నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన అనంతరం వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేయాలని ఏడాది క్రితమే టీఎస్‌పీఎస్సీ.. ప్రభుత్వాన్ని కోరింది. అయినప్పటికీ ప్రక్రియ పూర్తికాలేదు.
- గ్రూప్-1తో పాటు గ్రూప్-2, 3 పోస్టులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు పెండింగ్‌లో పడిపోయాయి. ఆ ఉద్యోగాల జాబితాను కమిషన్ సంబంధిత విభాగాలకు తిప్పిపంపింది. నూతన జోనల్ విధానం కింద పునర్‌వ్యవస్థీకరించి ప్రతిపాదనలు పంపించాలని కోరింది.
"ప్రభుత్వం నుంచి సవరణ ప్రతిపాదనలు వచ్చేవరకు ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం లేదని సమాచారం"