రాష్ట్రంలో అనధికారిక ప్లాట్లు, లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల పరిధుల్లోని అనధికారిక లేఅవుట్‌లు, ప్లాట్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్తించేలా లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకాన్ని (ఎల్‌ఆర్‌ఎస్‌ను) ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 26వ తేదీ వరకూ రిజిస్టర్ అయిన అనధికారిక ప్లాట్లు, లేఅవుట్‌లను క్రమబద్ధీకరించుకునేందుకు అనుమతిచ్చింది.
అక్టోబరు 15 వరకు
ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 15ను ఆఖరు తేదీగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో 2015 నవంబరు రెండున పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు వీలు కల్పించగా తాజాగా ప్రభుత్వం మరోసారి ఇప్పుడు అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో ప్రణాళికాబద్ధమైన సమీకృత అభివృద్ధి లక్ష్యంగా అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏవి క్రమబద్ధీకరించరంటే...
- నిషేధిత భూముల జాబితాలో ఉన్నవాటిని.
- భూగరిష్ఠ పరిమితి చట్టం నిబంధనలకు భిన్నంగా ఉన్నవి.
- వివాదాస్పదమైనవి, సరిహద్దు వివాదాలు కలిగినవి.
- జీవో111లో నిర్దేశించిన ప్రాంతాలు.
- జలవనరులు, ఎఫ్‌టీఎల్ పరిధిలోనివి.
- నిర్దేశించినగడువు తర్వాత రిజిస్టర్ అయినవి.
- నాలాలకు రెండుమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నవి.
- విమానాశ్రయాలు, రక్షణ, సైనిక ప్రాంతాలకు 500 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నవి.
- మాస్టర్‌ప్లాన్‌లో నిర్దేశించిన పారిశ్రామిక జోన్‌లు, తయారీ జోన్‌లు రిక్రియేషన్ కోసం కేటాయించిన ప్రాంతాలు, జలవనరుల ప్రాంతాల్లోనివి.
- చెరువులు, నదులు, వాగులు, ఇతర జలవనరులకు నిర్దేశించిన దూరంకంటే తక్కువ దూరంలో ఉన్నవి.
- ఆన్‌లైన్‌లో లేదా మీ సేవలో దరఖాస్తుకూ అవకాశం
- క్రమబద్ధీకరణకు ఆన్‌లైన్‌లో లేదా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పురపాలక వెబ్‌సైట్‌లో, మీ సేవా కేంద్రాలు, స్థ్థానిక సంస్థలోని సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో లేదా మొబైల్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్లాట్లకు రూ.1,000... లేఅవుట్‌కు రూ.10,000
అనధికారిక లేఅవుట్‌లలో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లను; కనీసం పదిశాతం ప్లాట్లు రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయించిన అనధికారిక లేఅవుట్‌లను క్రమబద్ధీకరణకు అర్హత కలిగినవిగా ప్రభుత్వం ప్రకటించింది. క్రమబద్ధీకరణకు సేల్‌డీడ్ లేదా టైటిల్ డీడ్ తప్పనిసరి అని పేర్కొంది. అగ్రిమెంట్ లేదా జీపీఏను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేసింది. అసైన్డ్ భూముల్లో ప్లాట్‌లు, లేఅవుట్‌లు ఉంటే జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ప్లాట్లకు రిజిస్ట్రేషన్ రుసుం రూ.1,000గా, లేఅవుట్ రిజిస్ట్రేషన్ రుసుంను రూ.10,000గా నిర్దేశించింది. ఎల్‌ఆర్‌ఎస్ నిధులను ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాలో ఉంచి పట్టణ స్థానిక సంస్థలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించనున్నట్లు పేర్కొంది.
క్రమబద్ధీకరించుకోకుంటే...
- రిజిస్ట్రేషన్లు జరగవు
- నీటి కనెక్షన్, డ్రెయినేజీ, సీవేజి కనెక్షన్ లభించవు
- భవన నిర్మాణ అనుమతులు ఇవ్వరు