సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ దూసుకెళ్తోందని... మన జీవితంలో భాగమైందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత్ రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారు అని తెలిపిన గవర్నర్.... ఇంటర్నెట్ లేని జీవితాలు ఊహించలేమన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇగ్నైట్-2021 సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరోనా వేళ ఆన్‌లైన్ తరగతులకు ఇంటర్నెట్ ఎంతో దోహదపడిందన్న గవర్నర్.. నిరుపేద విద్యార్థులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. వారి కోసం వ్యక్తులు, సంస్థల నుంచి వాడిన ల్యాప్‌టాప్‌లను సేకరిస్తున్నామన్నారు. వాడిగలిగే స్థితిలో ఉండి పక్కనపెట్టిన ల్యాప్‌టాప్‌లను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంతో నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వీహబ్ సీఈవో దీప్తి రావుల, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య హాజరై సాంకేతికత అంశంపై తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతపైనే రాబోయే పదేళ్ల వ్యాపారాలు, సంస్థల నిర్వహణ జరుగుతాయని నిపుణులు తెలిపారు. అటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీలపై యువత పట్టు సంపాదించి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు.
'సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ దూసుకెళ్తోంది. సాంకేతికత మన జీవితంలో భాగమైంది. ఇంటర్నెట్ లేని జీవితాలు ఊహించలేం. భారత్ రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారు. కరోనా వేళ ఆన్‌లైన్ తరగతులకు ఇంటర్నెట్ ఎంతో దోహదం చేసింది.'
- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్