KTR About TASK: స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ ఏ విధంగా అప్‌డేట్ అవుతుందో.. అదే విధంగా మన నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యం ఉంటేనే అవకాశాలను అందిపుచ్చుకోగలమని స్పష్టంచేశారు. టీ-హబ్ 2.0లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్(టాస్క్) కార్పొరేట్ ఒప్పంద కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఒకే రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 53 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో 26 ఒప్పందాలు కొత్తవి కాగా 27 ఒప్పందాలు పునరుద్దరించబడినవి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి చెందిన 1.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్, టీ-ప్రైడ్ వంటి వాటితో పరిశ్రమల కల్పనకు ప్రభుత్వం అవకాశమిస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణలకు టీ-హబ్ కేంద్రంగా మారిందని కేటీఆర్ వివరించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు.. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. టాస్క్‌లో 718 కళాశాలలు భాగసామ్యమయ్యాని తెలిపారు. టాస్క్ కేవలం హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్ కేంద్రాల్లో విస్తరించామన్నారు. భవిష్యత్తులో నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. టాస్క్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ యువతకు విజ్ఞప్తి చేశారు.
'తెలంగాణ ప్రభుత్వం టాస్క్ లాంటి సంస్థలను నెలకొల్పింది. టాస్క్ కింద కింద... వివిధ విభాగాలకు చెందిన 718 కళాశాలలు నమోదు చేసుకున్నాయి. గత 8 ఏళ్లలో 6 లక్షల 53 వేల 189 మంది విద్యార్థులకు... శిక్షణ, నైపుణ్యాలను అందించింది. విద్యార్థులనే కాకుండా టాస్క్ ద్వారా శిక్షకులకు కూడా శిక్షణ ఇస్తున్నాం. 14 వేల338 మంది శిక్షకులు మరింత శిక్షణ పొందారు. ఇప్పటివరకు టాస్క్ కింద 2లక్షల 44వేల 617 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. కేవలం టాస్క్‌ను హైదరాబాద్ వరకే కాకుండా తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్లకు వరంగల్‌కు విస్తరించాం. వీటితోపాటు నల్గొండ మహబూబ్‌నగర్ వంటి పట్టణాలకూ విస్తరిస్తాం.' -కేటీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
ఇవీ చూడండి: