ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం దళితబంధులో ఒక్కో కుటుంబానికి ఇచ్చే ఆర్థిక సాయంతో ఏయే ఆస్తులు కొనుగోలు చేయవచ్చు, ఏయే యూనిట్లు స్థాపించవచ్చో వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. గ్రామాలు, గ్రామాలు-ఉప పట్ణణాలు, గ్రామాలు-పట్టణాలు, పట్టణాలు ఇలా నాలుగు రకాలుగా విభజించి జాబితాను రూపొందించింది. గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలకు భిన్నంగా 30 రకాలను ఇందులో నిర్దేశించింది. వీటితో పాటు మరిన్నింటిని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వాసాలమర్రిలో పథకం ప్రారంభమైనా... పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం కేసీఆర్ శాలపల్లి-ఇందిరానగర్ వద్ద దళితబంధును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఈ యూనిట్లను అందజేయనున్నారు. వీటి కొనుగోళ్లు, స్థాపనతో పాటు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఒకటీరెండు రోజుల్లో విడుదల చేయనుంది.
ఇదీ జాబితా..
- గ్రామాలు: మినీ డెయిరీ యూనిట్ (10 నుంచి 12 పాడి గేదెలు), పందిరి కూరగాయల సాగు- వరినాటు యంత్రాలు 2+ 1 పవర్‌టిల్లర్, వేపనూనె- పిండి తయారీ+ఆటో ట్రాలీ
- గ్రామాలు, ఉప పట్టణాలు: సాగు యంత్ర పరికరాల దుకాణం, మట్టి ఇటుకల తయారీ+ఆటో ట్రాలి, ట్రాక్టర్+ట్రాలీ, కోడిపిల్లల పెంపకం (నాటు, బాయిలర్ కోళ్లు)+ఆటోట్రాలీ
- గ్రామాలు, పట్టణాలు: సెవెన్ సీటర్ ఆటో, 3 ఆటోరిక్షాలు, 3 సరుకు రవాణా చేసే మూడు చక్రాల ఆటో ట్రాలీలు, ప్రభుత్వం అనుమతించిన విత్తనాలు-ఎరువులు-పురుగుమందుల దుకాణం, టెంట్‌హౌస్-డెకరేషన్ లైటింగ్, సౌండ్ సిస్టం+ఆటోట్రాలీ, మడిగల నిర్మాణం-వ్యాపారం (సొంత ఇంటి వద్ద స్థలం ఉన్నవారు), ఆయిల్‌మిల్లు-పిండిగిర్నీలు
- పట్టణాలు: 4 చక్రాల సరకు-ప్రయాణికుల వాహనం, ఎలక్ట్రానిక్స్ దుకాణం, రోగ నిర్ధారణ కేంద్రం+మెడికల్ షాపు, ఎలక్ట్రికల్+బ్యాటరీలషాపు, హార్డ్‌వేర్-శానిటరీ దుకాణం+ఆటోట్రాలీ, సిమెంటు ఇటుకలు తయారీ+ఆటోట్రాలీ, సెంట్రింగ్-ఆర్‌సీసీరూఫ్ తయారీ+ కాంక్రీటు మిశ్రమం తయారీ యంత్రం, టైల్స్- ఆక్రిలిక్ షీట్ల షాపు+ఆటోట్రాలీ, మూడు కాంక్రీటు మిశ్రమ తయారీ యంత్రాలు, హోటల్+క్యాటరింగ్+ ఆటోట్రాలీ, ఐరన్‌గేట్లు- గ్రిల్స్ తయారీ యూనిట్+ఆటో ట్రాలీ, ప్రభుత్వ అనుమతితో మెడికల్ జనరల్ స్టోర్స్, ఫ్రాంచైజీలో మినీ సూపర్‌బజార్, డీటీపీ-మీసేవ-ఆన్‌లైన్ సేవలు+ఫోటో స్టూడియో, బిల్డింగ్ సామగ్రి, హార్డ్‌వేర్ దుకాణం.
ఇదీచూడండి: Dalitha Bandhu: రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు