రాష్ట్రంలో అనుమతి లేని ప్లాట్లు, అనధికార లేఅవుట్ క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది. రానున్న రెండు రోజుల్లో ఒక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సుపరిపాలన కేంద్రం (సీజీజీ) నుంచి తీసుకోనుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు వర్తించేలా ఎల్‌ఆర్‌ఎస్ ఉత్తర్వులను సోమవారం ప్రభుత్వం జారీ చేసింది.
పాత జీవో ప్రకారం దరఖాస్తులు నిలిపివేత
ఈ జీవో వచ్చి నాలుగు రోజులు కావడం, అక్టోబరు 15 వరకే గడువు ఉండటంతో భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు పురపాలక అధికారులను సంప్రదించి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 30వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో పాత జీవో ప్రకారం దరఖాస్తులు తీసుకోవడాన్ని నిలిపివేశారు.
ఇక అన్నీ కొత్త జీవో ప్రకారమే..
పాత.. కొత్త జీవోల మధ్య గందరగోళానికి శుక్రవారం తెరదించనున్నట్లు తెలుస్తోంది. పాత జీవో ప్రకారం విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను ఆ జీవో ప్రకారమే పరిష్కరిస్తూ.. కొత్తగా వచ్చే దరఖాస్తులకు తాజా జీవో వర్తించేలా ఉంటుందని సమాచారం. నగర పాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాల మధ్య ఎల్‌ఆర్‌ఎస్ ఎవరు చేయాలనే అంశంలోనూ స్పష్టత ఇవ్వనున్నారు. 2015లో వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో గతంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేసింది. ఈసారి ఆ సంస్థకు ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం ఉందా? లేదా? అనే చర్చ పురపాలక వర్గాల్లో జరుగుతోంది.
వేగంగా పరిష్కారమే లక్ష్యం
ఈసారి ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ సులభంగా, వేగంగా పరిష్కారమయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నట్లు పురపాలక ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థలకు నిధులు భారీగా అందుబాటులోకి వచ్చే నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లనున్నారు. దరఖాస్తుతో పాటు అందజేయాల్సిన ప్రాథమిక డాక్యుమెంట్‌గా సేల్‌డీడ్ లేదా టైటిల్‌డీడ్‌ను ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం నిర్దేశించిన డాక్యుమెంట్ల వివరాలు
- సేల్‌డీడ్ లేదా టైటిల్‌డీడ్
- లింక్ డాక్యుమెంట్
- ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)
- మార్కెట్ వాల్యూ (సబ్‌రిజిస్ట్రార్ నుంచి)
- ప్లాను
- ఇండెమినిటీ బాండు (వివరాలు సక్రమం అని స్వీయ ధ్రువీకరణ పత్రం)
- రోడ్డు విస్తరణ అండర్ టేకింగ్
- ఆధార్ కార్డు
ఇదీ చదవండి: పరిమితి సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు