ప్రభుత్వమే తల్లిదండ్రిగా మారి అనాథల సంరక్షణ, సంక్షేమం, భవిష్యత్ బాధ్యతలు తీసుకునేలా... దేశంలోనే అత్యుత్తమ, ఆదర్శవంతమైన విధానాన్ని రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అనాథలు, అనాథాశ్రమాలు, కొవిడ్ వల్ల అనాథలైన చిన్నారుల స్థితిగతులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసమావేశం నేడు జరిగింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపసంఘంలోని మంత్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనాథల సంక్షేమాన్ని మానవీయ కోణంలో ప్రభుత్వం చూస్తుందని, ఎంత ఖర్చునైనా భరిస్తుందని ఉపసంఘం తెలిపింది. దేశం మొత్తం గర్వించేలా.. ఇతర రాష్ట్రాలలన్నీ అనుసరించేలా కొత్త విధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. అనాథగా ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన పిల్లలు ఎదిగి, స్థిరపడి కుటుంబంగా తయారయ్యే వరకు ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా బాధ్యతలు తీసుకునేలా... కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని మంత్రులు తెలిపారు.
న్యాయపర ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా విధానాన్ని రూపొందిస్తామని మంత్రులు వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ వర్గాలకు అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే గొప్పగా అనాథల సంరక్షణ కోసం అమలయ్యేలా కొత్త విధానం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్‌లు, హోమ్స్, ఆశ్రమాలను పటిష్ఠంగా తయారుచేస్తూ, ప్రైవేట్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో గొప్పగా నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాలను ప్రోత్సహించేలా ఉపసంఘం సూచనలు ఉంటాయని మంత్రులు అన్నారు. క్షేత్రస్థాయిలో సభ్యులు పరిశీలించి అభిప్రాయాలు క్రోడీకరించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇదీ చూడండి:
Govt Help: మ్యాన్‌హోల్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం