TS Govt lands Encroachment at Annojiguda : జాతీయ రహదారి (హైదరాబాద్-వరంగల్)కి సమీపాన.. అన్నోజీగూడలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు బయట పడుతున్నాయి. కబ్జా చేసిన స్థలాలను ‘అధికారికం’ చేసుకోవడానికి ఆక్రమణదారుల ఎత్తుగడలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజీగూడలో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్న వైనాన్ని ‘ఈనాడు-ఈటీవీ భారత్’ సోమవారం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ప్రాంతంలో ఆక్రమణదారులు ముందు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి.. వెంటనే సిమెంటు ఇటుకలు, రేకులతో ఇళ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత ఒక ఇంటి నంబరును సృష్టించి విద్యుత్ మీటర్లు కూడా పొందుతున్నారు. దీంతో కబ్జాలపై ఎవరైనా అడిగితే వీటిని చూపిస్తూ అన్ని ‘ఆధారాలు’ ఉన్నాయని దబాయిస్తున్నారు. గత ఐదేళ్లలో లెక్కకు మిక్కిలి ఇలాంటి ఇళ్లు నిర్మించి విక్రయించినట్లు తెలుస్తోంది. రూ. 50 వేలు ఇస్తే స్థానిక నాయకులు కొందరు ‘పత్రాలు’ సృష్టించి ఇస్తారనేది బహిరంగ రహస్యం.
అలాగే ఆక్రమణదారులు కొందరు ఇళ్లు నిర్మించుకుని ఎవరికివారే నంబర్లు వేసుకుంటున్నారు. ఐదేళ్ల క్రితం గ్రామ పంచాయతీ నుంచి పోచారం పురపాలక సంఘంగా ఏర్పడిన ఈ ప్రాంతంలో కొత్తగా మంజూరు చేసిన ఇళ్ల నంబర్లు తక్కువేనని స్వయానా మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఇందుకు విరుద్ధంగా పెద్దఎత్తున ఇళ్లకు నంబర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీగా ఉన్నప్పుడు నంబర్లు మంజూరైనట్లు చూపేందుకు కొందరు తప్పుడు పత్రాలు కూడా సృష్టిస్తున్నట్లు సమాచారం. కొందరు సమీపంలో ఉన్న ఇంటి నంబరుకు ఉప సంఖ్య చేర్చి కొత్త నంబరును పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏదో ఒక నంబరు సృష్టించి దానిపై విద్యుత్ మీటర్లు పొందుతుండటం సర్వసాధారణంగా మారింది.
రెవెన్యూ యంత్రాంగం విచారణ.. అన్నోజీగూడలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంపై ‘ఆక్రమించి.. అమ్మేస్తున్నారు!’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. సర్కారు స్థలాలున్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సిబ్బంది సోమవారం తనిఖీలు ప్రారంభించారు. మంగళవారం కూడా ఇంటింటి విచారణ చేపడతామని ఘట్‌కేసర్ తహసీల్దారు విజయలక్ష్మి తెలిపారు. కాగా పోచారం పురపాలక సంఘం ఏర్పాటయ్యాక 10-15 ఇళ్లకు మాత్రమే నంబర్లు ఇచ్చినట్లు పురపాలక సంఘం కమిషనర్ సురేశ్ తెలిపారు. అలాగే నిర్మాణానికి సంబంధించిన ఏదో ఒక ఆధారం చూపితే తాము విద్యుత్ మీటరు మంజూరు చేస్తామని సహాయ డివిజనల్ ఇంజినీరు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.