నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో సీఎంవో, సీఎస్ కార్యాలయం, ఇతర ప్రధాన శాఖలన్నీ బీఆర్కేఆర్ భవన్‌కు తరలుతున్నాయి. ఎస్పీఎఫ్, ఐఎస్‌డబ్ల్యూ, సీఎస్‌డబ్ల్యూ, ఐబీ, ఎస్బీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఇలా అన్ని విభాగాల సమన్వయంతో పోలీస్ శాఖ బీఆర్కేఆర్ భవన్, ఆ పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. రక్షణ ఏర్పాట్లపై రెండ్రోజుల్లో ప్రభుత్వానికి సంపూర్ణ నివేదిక ఇవ్వనుంది.
బీఆర్కేఆర్ భవన్ పరిసరాలు పరిశీలన
హోం శాఖకు సంబధించిన వివిధ బృందాలు ఇప్పటికే బీఆర్కేఆర్ భవన్ దాని పరిసర ప్రాంతాలను పరిశీలించాయి. జీహెచ్ఎంసీ గేట్ దగ్గర, రిట్జ్ హోటల్ కింద కళాంజలి సమీపంలో.. మధ్యలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కనే ఉన్న రోడ్లు, హోప్ హాస్పిటల్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద బీఆర్కేఆర్ భవన్ వైపు వెళ్లే జంక్షన్ వద్ద వాహన రాకపోకలను నిలువరించనున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న రహదారులన్నిటినీ మూసేయాలని ప్రభుత్వానికి నివేదించనున్నారు.
ప్రధాన సమస్య ట్రాఫిక్
పలు శాఖలు బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలితే పార్కింగ్ ఓ ప్రధాన సమస్యగా మారనుంది. బీఆర్కేఆర్ భవన్లో కొన్ని, దాని ముందు రోడ్డుపై మరికొన్ని వాహనాలు పార్క్ చేసే వెసులుబాటు ఉంది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఖాళీ స్థలాన్ని సైతం పార్కింగ్ కోసం ఉపయోగించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వానికి సూచనలు చేయనున్నారు.
రెండ్రోజుల్లో నివేదిక
ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీఆర్కేఆర్ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆ పరిసరాలను హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించి, ఆ ప్రాంతంలోని రహదారులపై వాహన రాకపోకలను అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ వివరాలన్నిటినీ క్రోడీకరిస్తూ హోంశాఖ రెండ్రోజుల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.
- ఇదీ చూడండి : హైదరాబాద్‌లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్