కొవిడ్ ప్రభావం వల్ల దెబ్బతిన్న ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు సంబంధించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. వ్యాపార సంస్థలను మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టులను ఎంఎస్ఎంఈలకు వచ్చేలా చూడడమే గాక.. అవసరమైన చర్యలు తీసుకోవడంపై సర్కారు దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
ఐటీ శాఖ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్, నాస్కాం, ఐటీ రంగ ప్రతినిధులను కమిటీలో సభ్యులుగా నియమించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. వీలైనంత వరకు ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు వెళ్లేలా కమిటీ దృష్టి సారించనుంది. పెద్ద ప్రాజెక్టులయితే కొన్ని ఎంఎస్ఎంఈలకు ఉమ్మడి కన్సర్టియంగా అవకాశం ఇవ్వడం, అన్ని కంపెనీలకు అవకాశాలు దక్కేలా కమిటీ చర్యలు తీసుకోనుంది.
ఎంఎస్ఎంఈలకు ఉన్న ఇబ్బందులు, ఇతరత్రా నిబంధనల సరళీకరణపై కూడా దృష్టి సారించనుంది. ప్రభుత్వ ఐటీ ప్రాజెక్టుల వివరాలు పూర్తిగా తెలిసేలా డ్యాష్‌బోర్డును కూడా సిద్ధం చేయనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నూతన సాంకేతికత అంశాలు, వినూత్న పరిష్కారాలకు ఉన్న అవకాశాలను గుర్తించి వాటిలో ఎంఎస్ఎంఈలకు భాగస్వామ్యం కల్పించడంపై చర్యలు తీసుకుంటారు. కమిటీ ప్రతి నెలరోజులకోమారు లేదా అవసరమైనపుడు సమావేశం కావాలని ప్రభుత్వం నిపుణులను కన్సల్టెంట్లుగా, ప్రత్యేక అహ్వానితులుగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.