కృత్రిమ మేధతో కూడిన వ్యక్తిగతీకరించిన బీమా సేవలను తెలంగాణ రైతులకు అందించేందుకు వింగ్ స్యూర్(Wing Sure) సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఈ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులను కాపాడేందుకు కృత్రిమ మేధను, లోతైన సాంకేతికతను వినియోగిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా వింగ్ స్యూర్ లోతైన సాంకేతిక ఆధారిత పంట బీమా ఉత్పాదనలను, సలహాలను చిన్న రైతులకు అందించనుంది.
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనుంది. వ్యవసాయ విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయనుంది. ఈ కార్యక్రమం కింద రైతులకు అవసరమైన శిక్షణ, సలహా సేవలను సంస్థ రైతులకు అందిస్తుంది. అదే విధంగా సమాచార సేకరణ, ఇతర కార్యకలాపాలను నిర్వర్తించనుంది. దానికి తోడుగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధన కేంద్రాలు ఆయా పంటలకు, శీతోష్ణస్థితి పరిస్థితులకు సంబంధించి సలహాలు, సూచనలను వింగ్ స్యూర్ వేదిక ద్వారా అందించనున్నాయి.
ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది. ఇది ఆర్థిక సాధికారికత, కలసి పని చేసే అవకాశాలు, వాల్యూ చెయిన్‌లో వినూత్నత, వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వ ఆశయాలకు అండగా నిలువనుంది.
ఇదీ చదవండి: Cm KCR tour in Delhi: ఈనెల 25న మరోసారి హస్తినకు సీఎం కేసీఆర్!